యశ్‌వర్దన్ చౌహాన్ (PC: BCCI Domestic/X)
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు తిరిగి పుంజుకుంది. మిడిలార్డర్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గ్రౌండ్ ‘బి’లో భారత్- ఆసీస్ అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.
174 పరుగులకే ఆలౌట్
టాస్ గెలిచిన భారల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. నీల్ పటేల్ (31), చార్లీ హెండర్‌సన్ (37) మాత్రమే ముప్పై పరుగుల స్కోరు దాటగలిగారు. ఆతిథ్య జట్టు బౌలర్లలో తన్మయ్ బలోడా ఆరు వికెట్లతో చెలరేగగా.. అయాన్ అక్రం రెండు, మోహిత్ ఉల్వా, ప్రియాన్షు సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్.. సోమవారం ఆట పూర్తయ్యే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు లక్ష్య రాయ్ చందాని (1), సాగర్ విర్క్ (16) పూర్తిగా నిరాశపరిచారు.
యశ్‌వర్దన్ చౌహాన్ అర్ధ శతకం
ఈ క్రమంలో 38/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టు.. నిలకడైన ఆట తీరుతో ఆధిక్యంలోకి వచ్చింది.
వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (61 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ యశ్‌వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (83 బంతుల్లో 52)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో మనాల్ చౌహాన్ 34, ఆర్యన్ యాదవ్ 30 పరుగులతో రాణించారు.
ఆధిక్యంలోకి భారత్
లోయర్ ఆర్డర్‌లో మోహిత్ ఉల్వా (5), అయాన్ అక్రం (0) విఫలమయ్యారు. వీళ్లిద్దరు ఒకే ఓవర్లో (52వ ఓవర్) అవుట్ కాగా.. అప్పటికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి.. పది పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక 60 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్ ఓవరాల్‌గా యాభైకి పైగా (55) పరుగుల ఆధిక్యం సంపాదించింది. ప్రియాన్షు సింగ్ (5*), అభిప్రయ్ బిస్వాస్ (47*) క్రీజులో నిలిచారు.


