యశస్వి జైస్వాల్ (PC: BCCI/Sonyliv)
న్యూజిలాండ్- భారత్ ‘ఎ’ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టులో ఆఖరిదైన నాలుగో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. వర్షం వల్ల మంగళవారం నాటి ఆట తుడిచిపెట్టుకుపోవడంతో ఈ మ్యాచ్ కూడా డ్రా అయింది.
కాగా న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లగా.. ఇందుకు సన్నాహకంగా భారత్- కివీస్ ‘ఎ’ జట్లు ముందుగా మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాయి.
భారత్ భారీ స్కోరు
తొలి రెండు మ్యాచ్‌లు డ్రా కాగా.. ఇరుజట్ల మధ్య లిన్‌కోన్ వేదికగా శనివారం మూడో అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ మరోసారి శతకం (102)తో అలరించగా.. సాయి సుదర్శన్ భారీ హాఫ్ సెంచరీ (88) సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (15) నిరాశపరచగా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (71), తిలక్ వర్మ (81 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇక రవీంద్ర జడేజా 25 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకం (50)తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐదు వికెట్ల నష్టానికి 464 పరుగుల భారీ స్కోరు వద్ద భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ గిబ్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. జారోడ్ మెకాయ్, కామెరాన్ పాల్, డనురు ఫెర్న్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. భారత పేసర్ ప్రసిద్ కృష్ణ ఆదిలోనే దెబ్బకొట్టాడు.
రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు
ఓపెనర్లలో రైస్ మరియును డకౌట్ చేసిన ప్రసిద్ కృష్ణ.. కర్టిస్ హీపీని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు ఉండగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 10, జాక్ గిబ్సన్ ఒక పరుగుతో క్రీజులో నిలిచారు.
అయితే, సోమవారం నాటి మూడో రోజు ఆట వర్షం వల్ల రద్దైపోయింది. మంగళవారం కూడా వాన తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది.
జడ్డూ, బుమ్రాకు ప్రాక్టీస్
ఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ దొరికింది. బుమ్రా ఆరు ఓవర్ల బౌలింగ్‌లో పదకొండు పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. జడ్డూ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 25 పరుగులు చేయగలిగాడు.
ఇదీ చదవండి: జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పృథ్వీ షా!.. మరి రుతురాజ్?


