source: X
లింకన్ వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి, న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో రోజు మూడో సెషన్ వరకు బ్యాటింగ్ చేసి 464-5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ (81 నాటౌట్) సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (102) వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (88) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధృవ్ జురెల్ 71 పరుగుల వద్ద ఔట్ కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 25 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ గిబ్సన్ 2, మెక్‌కే, డన్రు, పాల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఈ సిరీస్ అనంతరం నవంబర్ 19 నుంచి టీమిండియా న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. టీమిండియా ఆటగాళ్లకు న్యూజిలాండ్‌లో పరిస్థితులు అలవాటు పడేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. భారత టెస్ట్ జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఈ సిరీస్‌లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో వన్డే హ్యామిల్టన్ వేదికగా నవంబర్ 10న జరుగనుంది.
ఇదీ చదవండి: షమీకి టీమిండియా కోచింగ్ బాధ్యతలు..?


