source: X
భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ నిన్న (శుక్రవారం) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 36 ఏళ్ల షమీ చాలాకాలంగా అవకాశాలు రాక, తప్పనిసరి పరిస్థితుల్లో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో 10 ఏళ్ల అతడి అద్భుత కెరీర్‌కు తెరపడింది.
2013లో టెస్ట్ అరంగేట్రం చేసిన 64 మ్యాచ్‌ల్లో 229 వికెట్లు పడగొట్టిన షమీ.. తన పేస్, స్వింగ్, కచ్చితమైన బౌలింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. టీమిండియా తరఫున ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన షమీ.. ఇంటాబయటా అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో షమీ కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.
దక్షిణాఫ్రికాపై 5/44 (సెంచూరియన్, 2021)
2021లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తన వేగం, కచ్చితత్వంతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ఈ మ్యాచ్‌లోనే షమీ 200 టెస్టు వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. అతడి బౌలింగ్ ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌటైంది. చివరకు భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచూరియన్‌లో భారత జట్టుకు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం.
దక్షిణాఫ్రికాపై 5/35 (విశాఖపట్నం, 2019)
2019లో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో షమీ చెలరేగిపోయాడు. తన రివర్స్ స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. షమీ ధాటికి చివరి రోజు దక్షిణాఫ్రికా 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 203 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
వెస్టిండీస్‌పై 5/47 (కోల్‌కతా, 2013)
2013లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో షమీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే నాలుగు వికెట్లు తీసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన అరంగేట్రాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు.
షమీ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికాపై 5/28 (జోహన్నెస్‌బర్గ్, 2018)
2018లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు భారత క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే విజయాల్లో ఒకటి. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఒక దశలో 124/1తో పటిష్ట స్థితిలో నిలిచింది.
అయితే షమీ తన పదునైన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 28 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కుప్పకూలింది. ఆ జట్టు 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షమీ ప్రదర్శన భారత విజయంలో కీలకంగా నిలిచింది.
ఆస్ట్రేలియాపై 6/56 (పెర్త్, 2018)
షమీ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 2018లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో అతడు 6/56తో విశ్వరూపం ప్రదర్శించాడు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై షమీ చెలరేగిపోయాడు. వేగం, కచ్చితత్వంతో ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.
ఈ మ్యాచ్‌లో షమీ చెలరేగినప్పటికీ భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కఠినమైన పరిస్థితుల్లో షమీ ప్రదర్శన అతడి టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ఇదీ చదవండి: టెస్ట్ క్రికెట్‌కు మహ్మద్ షమీ గుడ్ బై


