యశస్వి జైస్వాల్ (PC: BCCI/Sonyliv)
న్యూజిలాండ్- ‘ఎ’ జట్టుతో మూడో అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ జట్టు శుభారంభం అందుకుంది. తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు వందల పరుగుల మార్కు దాటేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కాగా మూడు అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా.. కివీస్-భారత్ ‘ఎ’ జట్ల మధ్య తొలి రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా (డ్రా)నే ముగిశాయి.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం లిన్‌కోన్ వేదికగా మూడో టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్- సాయి సుదర్శన్ జట్టుకు శుభారంభం అందించారు.
జైస్వాల్ మరోసారి శతక్కొట్టాడు
యశస్వి జైస్వాల్ మరోసారి శతక్కొట్టాడు. మొత్తంగా 138 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ పదహారు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 102 పరుగులు సాధించాడు. అయితే, ఫెర్న్స్ బౌలింగ్‌లో కామెరాన్ పాల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జైస్వాల్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సాయి అదుర్స్.. పడిక్కల్ విఫలం
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 53 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేసి జారోడ్ మెకాయ్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. వర్షం వల్ల ఆటకు అంతరాయం వల్ల.. తొలి రోజు ఆటను అరగంట ముందుగానే ముగించారు.
ఈ క్రమంలో శనివారం నాటి పూర్తయ్యేసరికి భారత జట్టు 69.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 77, కెప్టెన్ ధ్రువ్ జురెల్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. కివీస్ బౌలర్లలో మెకాయ్, ఫెర్న్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
న్యూజిలాండ్ ‘ఎ’తో మూడో అనధికారిక టెస్టుకు భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్, ముకేశ్ చౌదరి.
ఇదీ చదవండి: IND vs NZ: భారత జట్టుకు భారీ షాక్!
Back-to-back tons! Jaiswal is making all the right noises ahead of the Tests. 💥 Watch him in action in the #NZvIND Test series, starting November 19, on #SonySportsNetwork & #SonyLIV https://t.co/Uu1YXSiWQ1
— Sony LIV (@SonyLIV) November 7, 2026


