న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ వి.ప్రణవ్ ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో 13 రౌండ్‌లలో ప్రణవ్ 10.5 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచాడు.
గతేడాది ‘ఫిడే’ వరల్డ్ జూనియర్ చాంపియన్ టైటిల్ గెలిచిన తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల ప్రణవ్ ఈ టోర్నీ ఆరంభం నుంచే ప్రత్యర్థుల మీద పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. ఎల్డియార్ ఒరోజ్‌బెవ్ (కిర్గిస్తాన్), రాబర్ట్ ఫిలిపోస్యాన్ (అర్మెనియా) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఇదే టోర్నీ ర్యాపిడ్ ఫార్మాట్‌లో ప్రణవ్ రజతం గెలుచుకున్నాడు. 9 రౌండ్‌లలో 7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.


