వయసులో చిన్న...  ప్రతిభలో మిన్న! | World Chess Championship Under 12 at Hyderabad | Sakshi
Sakshi News home page

వయసులో చిన్న...  ప్రతిభలో మిన్న!

Oct 15 2026 12:38 AM | Updated on Oct 15 2026 12:38 AM

World Chess Championship Under 12 at Hyderabad

చదరంగం

చదరంగం కేవలం ఒక ఆట కాదు.. అది జీవిత పాఠం. కష్టకాలంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో ఈ 64 గళ్లు నేర్పుతాయి. నాగోలు శుభం కన్వెషన్లో 51వ నేషనల్‌ సబ్‌–జూనియర్‌ ఓపెన్‌ ఛాంపియన్షిప్, 42వ నేషనల్‌ సబ్‌–జూనియర్‌ బాలికల (అండర్‌ 15) చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ 2026 పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు 25 రాష్ట్రాల నుండి చెస్‌ క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటుతున్నారు.

 నేటి తరం చిన్నారులు మాత్రం 64 గళ్ల చదరంగంపై తమ మేధాశక్తితో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నారు. ఏకాగ్రత, సహనం. వ్యూహాత్మక ఆలోచనలను అలవర్చుకుంటూ చెస్‌ క్రీడలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి చెస్‌ టోర్నమెంట్లో చిన్నారులు పతకాల పంట పండిస్తున్నారు.

మొగ్గ దశలోనే మహామేధస్సు
నేడు ఐదేళ్ల ప్రాయం నుంచే చిన్నారులు చెస్‌ బోర్డు ముందు కూర్చుంటున్నారు. పావుల కదలికలపై పట్టు సాధిస్తూ, ప్రత్యర్ధుల వ్యూహాలను తిప్పికొడుతూ గ్రాండ్‌ మాస్టర్లకే సవాళ్లు విసురుతున్నారు. భారత్‌ నుంచి విశ్వనాథన్‌ ఆనంద్‌ వేసిన బాటలో నడుస్తూ, నేడు కోనేరు హంపి, డిక్కూ గుకేష్, ప్రజ్ఞానంద, ఆర్జున్‌ ఎరిగైసి వంటి దిగ్గజాల స్ఫూర్తితో చిన్నారులు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన పన్నెండేళ్లలోపు బాలబాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా ఆసియా, ప్రపంచ స్థాయి పోటీల్లోనూ విజయాల జెండా పాతుతున్నారు. 

శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ
ఉదయం పాఠశాల, సాయంత్రం చెస్‌ అకాడమీల్లో గంటల తరబడి శిక్షణ తీసుకోవడం, ఆన్‌లైన్‌ వేదికలపై అంతర్జాతీయ ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ చేయడం నేటి చిన్నారుల జీవనశైలిగా మారింది. జ్ఞాపకశక్తి, మంచి ఆలోచనలను పెంపొందించడంలో చెస్‌ అద్భుతంగా పనిచేస్తుండడంతో పేరెంట్స్‌ తమ పిల్లలను ఈ క్రీడవైపు  ప్రోత్సహిస్తున్నారు. వారిలో కొందరు చిన్నారులు తమ చెస్‌ ప్రయాణం గురించి, వారి గోల్స్‌ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 
– చిత్రం సైదులు, సాక్షి, హైదరాబాద్‌

 టాప్‌ టెన్‌లో పేరు
ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ అండర్‌ 13 ఓపెన్‌ చెస్‌ చాంపియ న్షిప్‌లో కాంస్య పతకం లభించింది. ప్రపంచ స్థాయి చెస్‌ టోర్నమెంట్‌లో టాప్‌ 10 జాబితాలో పేరుంది. త్వరలోనే గ్రాండ్‌ మాస్టర్‌ సాధిస్తాను.       
    – మోతె అద్విక్‌ రెడ్డి, హైదరాబాద్‌

విజయాలు సాధించా
సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కుంటున్నా. రాష్ట్ర, జాతీయస్థాయి చెస్‌ పోటీలలో విజయాలు సాధించాను. తెలంగాణ స్టేట్‌ అండర్‌ 15లో రాష్ట్రస్థాయిలో రాణించి చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ లభించింది.     
– గుండగాని శివాంశిక, తొర్రూర్, మహబూబాబాద్‌ జిల్లా  

 సమస్య పరిష్కారానికి చెస్‌
తొమ్మిదేళ్ల వయసునుంచి పేరెంట్స్‌  ప్రోత్సాహంతో చెస్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను.  జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో అండర్‌ 13లో మొదటి స్థానం లభించింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు అందుకున్నాను. బయట కూడా ఏ సమస్య వచ్చినా త్వరగా పరిష్కారం కనుక్కొనే నేర్పు చెస్‌ ద్వారా లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించి దేశానికి పేరు తేవాలన్నది నా లక్ష్యం.    
– చల్లా సహర్ష, కొత్తపేట, రంగారెడ్డి జిల్లా

 టైం పాస్‌ సాధన..
నాలుగేళ్ల వయస్సులో కరోనా సమయంలో టైం పాస్‌ కోసం చెస్‌ నేర్చుకున్నాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో 2 స్థానం, అండర్‌ 9లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాను. అమ్మానాన్నల  ప్రోత్సాహంతో నిరంతరం క్రమశిక్షణతో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సాధిస్తా.               
– వెంకట సాత్విక్, భద్రాద్రి కొత్తగూడెం

కఠినమైన సాధన
ప్రపంచ జూనియర్‌ అండర్‌ 8లో గోల్డ్‌ మెడల్‌ లభించింది. రాపిడ్, గోల్డ్, బ్రోంజ్‌ పతకాలనూ సాధించాను. రోజులో అధిక భాగం చెస్‌ బోర్డుకే కేటాయిస్తాను. చెస్‌లో పట్టు సాధించడానికి సాధన చేస్తున్నాను. 
– అదుల్ల దివిత్‌ రెడ్డి, హైదరాబాద్‌

 నిరంతర కృషి
రాష్ట్ర స్థాయిలో అండర్‌ 15లో మూడో స్థానంలో ఉన్నాను. నేషనల్‌ అండర్‌ 15 చెస్‌ చాంపియన్లో పాల్గొని విజయం సాధించాను. పెద్ద టోర్నమెంట్లు, హైరేటెడ్‌ ఆటగాళ్లతో పోటీ పడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాను.
– శశి హాసిని చింతల, హైదరాబాద్‌

గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదగడమే లక్ష్యం
నాలుగేళ్ల వయసు నుండి చెస్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. అండర్‌ 13, అండర్‌ 17లో సిల్వర్‌ మెడల్స్, ఫిక్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్లో ఏడవ స్థానం పొందాను. బాలబాలికల విభాగంలో మొదటిస్థానం లభించింది. గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదిగేందుకు ప్రాక్టీస్‌ చేస్తున్నాను.
– శిరీష కంది, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement