
సూపర్ చార్జర్స్ జయభేరి (PC: The Hundred)
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2025’ (The Hundred)లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ (Northern Superchargers) జైత్రయాత్ర కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుపై గెలుపొందిన బ్రూక్ బృందం.. తాజాగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ (Birmingham Phoenix)ను కూడా చిత్తు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
డేవిడ్ మలన్ అర్ధ శతకం
లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బర్మింగ్‌హామ్ జట్టు.. సూపర్‌చార్జర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు జాక్ క్రాలే (23 బంతుల్లో 45), డేవిడ్ మలన్ (34 బంతుల్లో 58) మెరుపు ఇన్నింగ్స్‌తో సూపర్‌చార్జర్స్‌కు శుభారంభం అందించారు.
బ్రూక్ ధనాధన్
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ మైకేల్ పెప్పర్ (21 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
I see the most craziest shot in 100 tournament.. harry brook 🔥pic.twitter.com/gUIEFuH6DT
— Navaldeep Singh (@NavalGeekSingh) August 16, 2025
మరోవైపు.. డాన్ లారెన్స్ (7 బంతుల్లో 15) బ్రూక్‌తో కలిసి వేగంగా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 100 బంతుల్లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఐదు వికెట్లు నష్టానికి ఏకంగా 193 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్ బౌలర్లలో క్రిస్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక సూపర్‌చార్జర్స్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 157 పరుగులకే పరిమితమైంది. సూపర్‌చార్జర్స్ బౌలర్లు మాథ్యూ పాట్స్ (3/26), జేకబ్ డఫీ (2/31), ఆదిల్ రషీద్ (2/26), టామ్ లావెస్ (2/23) విబృంభణ కారణంగా.. 100 బంతుల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
జేకబ్ బెతెల్ మెరుపులు వృథా
బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ టాపార్డర్ విల్ స్మీడ్ (1), బెన్ డకెట్ (11), జో క్లార్క్ (13) పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్ లివింగ్‌స్టోన్ (31 బంతుల్లో 46), జేకబ్ బెతెల్ (23 బంతుల్లో 48) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, మిగతా వారి నుంచి సహకారం అందకపోవడంతో సూపర్‌చార్జర్స్ చేతిలో బర్మింగ్‌హామ్‌కు ఓటమి తప్పలేదు.
కాగా ఆగష్టు 5న మొదలైన హండ్రెడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచింది. తద్వారా 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సన్ గ్రూపునకు చెందిన, కావ్యా మారన్ నాయకత్వంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది సిస్టర్ ఫ్రాంఛైజీ అన్న విషయం తెలిసిందే.
ఎనిమిది జట్లు
మరోవైపు.. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఆడిన నాలుగింటిలో మూడు ఓడి పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్ అట్టడుగున ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా హండ్రెడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్, ఓవల్ ఇన్విసిబుల్స్, సదరన్ బ్రేవ్, ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్, వెల్ష్ ఫైర్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరిట మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా జేకబ్