భారత్‌తో తొలి టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కీలక ఆటగాడు దూరం | Gus Atkinson Ruled Out Of First Test Vs India, Jamie Overton And Jacob Bethell Return To Squad | Sakshi
Sakshi News home page

భారత్‌తో తొలి టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కీలక ఆటగాడు దూరం

Jun 5 2025 3:16 PM | Updated on Jun 5 2025 4:16 PM

Gus Atkinson Ruled Out Of First Test Vs India, Jamie Overton And Jacob Bethell Return To Squad

జూన్‌ 20 నుంచి లీడ్స్‌ వేదికగా టీమిండియాతో జరుగబోయే తొలి టెస్ట్‌ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్‌ జట్టును ఇవాళ (జూన్‌ 5) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌ ఎంపిక​ కాగా.. పేసర్‌ జేమీ ఓవర్టన్‌ దాదాపు మూడేళ్ల తర్వాత టెస్ట్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 

ఈ జట్టులో కీలక ఆటగాడు గస్‌ అట్కిన్సన్‌కు చోటు దక్కలేదు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా అతను గాయపడ్డాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అట్కిన్సన్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతను తదుపరి టెస్ట్‌లు ఆడేది కూడా అనుమానంగా మారింది.

అట్కిన్సన్‌ స్థానాన్ని ఇంగ్లండ్‌ సెలెక్టర్లు ఓవర్టన్‌తో భర్తీ చేశారు. ఓవర్టన్‌ 2022 జూన్‌లో ఇంగ్లండ్‌ తరఫున తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ (న్యూజిలాండ్‌) ఆడాడు. గాయాల కారణంగా ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేసర్లు క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్స్‌ ఈ జట్టుకు ఎంపికయ్యారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తరఫున రాణించిన జేకబ్‌ బేతెల్‌ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారత్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

కాగా, భారత క్రికెట్‌ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. జూన్‌ 20, జులై 2, 10, 23, 31 తేదీల్లో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు లీడ్స్‌, బర్మింగ్హమ్‌, లార్డ్స్‌, మాంచెస్టర్‌, కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు భారత్‌ జూన్‌ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో కోసం​ భారత జట్టును ఇదివరకే ఎంపిక చేశారు.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత టెస్ట్‌ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల​ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్‌ సింగ్, కుల్దీప్ యాదవ్

 

Advertisement
 
Advertisement
Advertisement