జపాన్ వేదికగా ఆసియా క్రీడలు–2026 టోర్నమెంట్లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం తానిపర్తి చికిత హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
ఈ స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అశోక్ కుమార్, శ్రీనివాస్, కన్నం మధు, సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టి. రాజు, అరవింద్ తదితరులు పాల్గొని చికితకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు అందించిన చికిత విజయాన్ని అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు చికితను ప్రశంసించారు.
కాగా ఆసియా క్రీడల్లో చికిత మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ప్రీతికా ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నంతో కలిసి గోల్డ్ మెడల్ గెలిచింది. అదే విధంగా మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సాహిల్ జాధవ్‌తో కలిసి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్లో భారత్‌కు లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్ బెర్తు కూడా ఖరారైంది. కాగా చికిత స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో గల సుల్తాన్‌పూర్.


