ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ | England clean sweep three match ODI series against West Indies | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

Jun 5 2025 2:21 AM | Updated on Jun 5 2025 2:21 AM

England clean sweep three match ODI series against West Indies

మూడో వన్డేలోనూ ఓడిన వెస్టిండీస్‌

లండన్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో వన్డేలో హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 40 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. 

షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (71 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుడకేశ్‌ మోతీ (54 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అల్జారీ జోసెఫ్‌ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో విండీస్‌ గౌరవప్రద స్కోరును సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 3 వికెట్లు తీయగా... సాఖిబ్‌ మెహమూద్, బ్రైడన్‌ కార్స్, మాథ్యూ పాట్స్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 246 పరుగులుగా నిర్ణయించారు. 

ఇంగ్లండ్‌ ధనాధన్‌ ఆటతీరుతో కేవలం 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు జేమీ స్మిత్‌ (28 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెన్‌ డకెట్‌ (46 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు అవుటయ్యాక జో రూట్‌ (49 బంతుల్లో 44; 1 ఫోర్‌), హ్యారీ బ్రూక్‌ (36 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (20 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. 

జేమీ స్మిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించగా... జో రూట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ శుక్రవారం మొదలవుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement