ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ రీఎంట్రీ | New Zealand Announce ODI Squad For West Indies Series, Matt Fisher Earns Maiden Call-Up And Jacob Duffy Returns | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ రీఎంట్రీ

Jul 1 2026 9:31 AM | Updated on Jul 1 2026 10:09 AM

Duffy returns for West Indies series

జులై 11 నుండి వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం 16 సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్‌ సాంట్నర్‌ ఎంపిక కాగా.. యువ పేసర్ మ్యాట్ ఫిషర్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అనుభవజ్ఞుడైన జేకబ్ డఫీ (ఐపీఎల్‌ 2026లో ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌) తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఫిషర్‌కు తొలి పిలుపు
26 ఏళ్ల నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ ఫిషర్‌కు ఇదే తొలి వన్డే ఎంపిక. ఇప్పటికే 2025లో జింబాబ్వేపై టెస్టుల్లో, ఈ ఏడాది బంగ్లాదేశ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన ఫిషర్.. లిస్ట్-ఏ క్రికెట్‌లో 25 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

డఫీ రీఎంట్రీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తొలిసారి జాతీయ జట్టులోకి జేకబ్ డఫీ తిరిగి వచ్చాడు. టోర్నీ అనంతరం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన డఫీ, తన తొలి సంతానం జన్మించిన కారణంగా ఇంగ్లండ్ టెస్టు పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్‌కు తిరిగి అందుబాటులోకి వచ్చాడు.

కెప్టెన్‌గా సాంట్నర్
జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కరేబియన్ నెమ్మదైన పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని మైకేల్ బ్రేస్‌వెల్, జేడెన్ లెనాక్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌లకు స్పిన్ బాధ్యతలు అప్పగించారు. మార్క్ చాప్‌మన్ తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

విశ్రాంతి, వ్యక్తిగత కారణాలతో పలువురు దూరం
స్టార్ పేసర్లు కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ, విల్ ఓ'రూర్క్ అధిక మ్యాచ్‌ల భారం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. బ్లెయిర్ టిక్‌నర్ చీలమండ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. రెండో సంతానం జన్మించిన కారణంగా డెవాన్ కాన్వే ఈ పర్యటనకు అందుబాటులో లేడు. అలాగే ముందస్తు ఒప్పందం మేరకు రచిన్ రవీంద్ర మేజర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొననున్నందున ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

న్యూజిలాండ్ వన్డే జట్టు..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే, నిక్ కెల్లీ, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విల్ యంగ్.

కాగా, ఈ సిరీస్‌లో తొలి మూడు వన్డేలు జూలై 11, 13, 16 తేదీల్లో గయానాలో జరగనుండగా, చివరి రెండు మ్యాచ్‌లు జూలై 19, 21 తేదీల్లో బార్బడోస్‌లో నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement