అమెరికాతో భారత్‌ ‘సై’ | Chess tournament between India and the United States this year | Sakshi
Sakshi News home page

అమెరికాతో భారత్‌ ‘సై’

May 3 2025 3:23 AM | Updated on May 3 2025 3:23 AM

Chess tournament between India and the United States this year

అక్టోబర్‌లో రెండు జట్ల మధ్య చెస్‌ టోర్నీ 

బరిలో మేటి గ్రాండ్‌మాస్టర్లు 

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్, అమెరికాల మధ్య చెస్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన టాప్‌ స్టార్‌ ప్లేయర్లందరూ ఈ టోర్నీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ‘డ్రా’ తదితర వివరాలను శుక్రవారం వెల్లడించారు. అక్టోబర్‌ 4న అర్లింగ్టన్‌లోని ఇ–స్పోర్ట్స్‌ స్టేడియంలో చెస్‌ పోటీలు జరుగనున్నాయి. ఇరు దేశాల నుంచి ఐదుగురు చొప్పున ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు.  క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. 

అమెరికన్‌ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌ హికారు నకమురను గుకేశ్‌ ‘ఢీ’కొంటాడు. గుకేశ్‌తో పాటు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్, సాగర్‌ షా, కుర్రాడు ఎథన్‌ వాజ్‌తో పాటు భారత మహిళా ప్లేయర్, అంతర్జాతీయ మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌లు బరిలో ఉన్నారు. మొదటి బోర్డులో గుకేశ్, నకముర తలపడతారు. రెండో బోర్డులో అర్జున్‌... గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరువానాను ఎదుర్కొంటాడు. 

మూడో బోర్డులో సాగర్‌ షా, లెవి రొజ్మన్‌ పోటీపడనుండగా, మిగతా పోటీల్లో దివ్యతో కారిస్సా యిప్, ఎథన్‌ వాజ్‌తో టానిటొలువా అడ్యూమి తలపడతారు. టోర్నీ నిబంధనల విషయానికొస్తే బోర్డులోని ఇరు ఆటగాళ్ల మధ్య ఐదు రౌండ్ల గేమ్‌లు జరుగుతాయి. పది నిమిషాల్లో గేమ్‌ను ముగించాల్సి ఉంటుంది. అప్పటికీ ‘డ్రా’ అయితే మరో 5 నిమిషాల ఆటను కొనసాగిస్తారు. షూటౌట్‌కు వస్తే మరో నిమిషం అదనంగా కేటాయిస్తారు. అప్పటికీ సమఉజ్జీలుగా నిలిస్తే మాత్రం విజేత తేలే వరకు పోటీ కొనసాగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement