చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌ | Ben Stokes creates history vs New Zealand on Test return | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌

Jun 27 2026 1:37 PM | Updated on Jun 27 2026 1:57 PM

Ben Stokes creates history vs New Zealand on Test return

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. నాటింగ్హమ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు మిచెల్‌ శాంట్నర్‌ను ఔట్‌ చేయడంతో టెస్టుల్లో తన 250వ వికెట్‌ను పూర్తి చేశాడు. 

తద్వారా బ్యాటింగ్‌లో (టెస్టుల్లో) 7000కు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ అరుదైన ఫీట్‌ను గతంలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కల్లిస్‌ మాత్రమే సాధించాడు. కల్లిస్‌ 1995-2013 మధ్య 166 టెస్టుల్లో 13289 పరుగులు చేసి, 292 వికెట్లు తీశాడు.

తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌
ఈ క్రమంలో స్టోక్స్‌ మరో ఘనత కూడా సాధించాడు. టెస్టుల్లో 7000+ పరుగులు, 250+ వికెట్లు సాధించిన తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో 250 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు.

వివాదం తర్వాత ఘనంగా పునరాగమనం
నైట్‌ క్లబ్‌ వివాదం కారణంగా రెండో టెస్టుకు దూరమైన స్టోక్స్‌.. మూడో టెస్టులో ఘనంగా పునరాగమనం చేశాడు. రెండో రోజు తొలి సెషన్‌లో వికెట్‌ కోసం ఇబ్బంది పడిన ఇంగ్లండ్‌కు అద్భుతమైన బ్రేక్‌ ఇచ్చాడు. ఎనిమిది ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను అతి భారీ స్కోర్‌ చేయకుండా కట్టడి చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 215 పరుగులు వెనుకబడి ఉంది. 

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. డెవాన్‌ కాన్వే (157), కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (151) భారీ శతకాలతో కదంతొక్కారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ (113) శతక్కొట్టగా.. జేకబ్‌ బేతెల్‌ 74, రూట్‌ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ గెలవగా.. న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement