
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశాడు. పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ అజేయ అర్ధ సెంచరీ సాధించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్‌ను, జెర్సీని అందజేశాడు. తిలక్ ఇచ్చిన బ్యాట్‌తో రేవంత్ రెడ్డి క్రికెట్ షాట్ కొడుతున్న ఫోజు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి, ‘శాట్స్’ ఎండీ సోనీ బాలాదేవి, సీఎం ముఖ్యకార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆశలు వమ్ము చేయకూడదని...
శేరిలింగంపల్లి: పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఎంతో ఒత్తిడి ఉన్నా... ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత రెచ్చగొట్టినా... ఎక్కడా సంయమనం కోల్పోలేదని... వారికి తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. చిన్ననాటి నుంచి తాను ప్రాక్టీస్ చేసిన శేరిలింగంపల్లిలోని లేగలా క్రికెట్ అకాడమీకి మంగళవారం తిలక్ వచ్చాడు. ఈ సందర్భంగా తన కోచ్ సలామ్ బాయష్, అకాడమీ ఎండీ పృథ్వీ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
‘కోట్లాది మంది భారతీయుల ఆశలను వమ్ము చేయకూడదనుకున్నాను. చివర్లో ఒత్తిడి వచ్చినా... దేశం కోసం ఆడాలి, గెలిపించాలన్న లక్ష్యంతో ఓపికగా ఆడాను. హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించారు. నేనీ స్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ సలామ్, పృథ్వీ పాత్ర ఎంతో ఉంది. ఈ ఇద్దరినీ ఎప్పటికి మర్చిపోలేను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ విషయంలో కోహ్లి, రోహిత్ శర్మలు ఆదర్శం’ అని తిలక్ తెలిపాడు.