ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీఎస్ రామకృష్ణారావు
కాలుష్యరహిత మహానగరంగా హైదరాబాద్
కోర్ అర్బన్ ప్రాంతం పూర్తిగా ప్రక్షాళన: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్లాస్టిక్‌పై నిషేధం.. డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీలు
రోడ్లపై గుంతలు, చెత్త కనిపించడానికి వీల్లేదు
జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో ఉండాలి..
గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి
టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని మహానగరాన్ని పూర్తి కాలుష్య రహితంగా మార్చడంలో భాగంగా ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పాటు డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలను (ఈవీలు) ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రహదారులపై గుంతలు, చెత్త ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సమూల ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించినట్లు చెప్పారు. పరిపాలనను పట్టాలెక్కించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, అందుకు అధికారులు కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు.
చెరువులు కాపాడుకోవాలి
‘సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడుతున్నాం. జోనల్ కమిషనర్లు జనవరి నుంచి ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీదే. రోడ్లపై ఎక్కడా చెత్త, గుంతలు ఉండకూడదు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. వీటితో పాటు చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు జనవరి నుంచి నాలాల్లో పూడికతీత పనులు మొదలు పెట్టాలి.
యాక్టివిటీ జోన్స్‌గా పెద్ద చెరువులు
12 జోన్లలోని చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలి. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించి యాక్టివిటీ జోన్స్‌గా అభివృద్ధి చేయాలి. నెలకు 3 రోజులు పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. జనన, మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆన్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి.
వీధి దీపాలన్నీ వెలగాలి
నగరంలో ఏ ప్రాంతం అంధకారంలో ఉండడానికి వీల్లేదు. వీధి దీపాలు సరిపడా ఉండడమే కాదు.. అవి వెలిగేలా చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలి. ప్రతి పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ (చెత్త తొలగింపు) డ్రైవ్ నిర్వహించాలి. సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వీలైనంత త్వరగా స్పందించాలి. రాబోయే ఐదేళ్లకు కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్లాలి. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లతో నిత్యం సంబంధాలు, సమాచార వ్యవస్థ కలిగి ఉండాలి. క్యూర్ ఏరియాలోని ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. అందరూ కలిసి పనిచేస్తేనే నగర భవిష్యత్తు బాగుంటుంది..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఆహార భద్రతపై నిర్లక్ష్యం వద్దు..
‘క్యూర్ పరిధిలోని హోటళ్లలో ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి సొంత భవనాలు నిర్మించాలి. నెలకోసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తా..’ అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


