
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తావా? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అదే సమయంలో.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith)పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..
ఆదిలోనే షాకులు
భారత్-ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం మొదలైన రెండో టెస్టులో గిల్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో రోజు భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. భారత బౌలర్ల దెబ్బకు... ఇంగ్లిష్ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (19), బెన్ డకెట్ (0) సహా వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
‘బజ్‌బాల్’ దూకుడు
ఈ క్రమంలో గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లన నష్టానికి 77 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 77/3తో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. వెనువెంటనే జో రూట్ (22), బెన్ స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయింది. ఇలా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ తమదైన శైలి ‘బజ్‌బాల్’ ఆటకు తెరలేపారు.
43 బంతుల్లోనే
ఈ క్రమంలో కేవలం 43 బంతుల్లోనే జేమీ స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం. కాగా ఆదిలో కాస్త నెమ్మదిగానే ఆడిన జేమీ స్మిత్ వేగంగా యాభై పరుగుల మార్కు చేరుకోవడానికి.. భారత పేసర్ ప్రసిద్ కృష్ణ చెత్త బౌలింగే కారణం.
ఒకే ఓవర్‌లో 23 పరుగులు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్‌లో బంతితో బరిలోకి దిగిన ప్రసిద్ కృష్ణ... ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని కట్టుదిట్టంగా వేసిన అతడు.. ఆ తర్వాత పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి మూల్యం చెల్లించాడు. ప్రసిద్ బౌలింగ్‌లో జేమీ స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది.
Jamie Smith with back-to-back boundaries to start the 38th over 🔥
He's absolutely flying here 😍 pic.twitter.com/rLEry94aGo— England Cricket (@englandcricket) July 4, 2025
కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో
ఇక జేమీ స్మిత్‌కు బజ్‌బాల్ అటాకింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రసిద్ కృష్ణపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో.. ఏదేమైనా జేమీ స్మిత్ సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. కామెంటేటర్ రవిశాస్త్రి.. ‘‘కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత నిర్దయగా బాదేస్తావా?!’’అంటూ జేమీ స్మిత్ సూపర్ బ్యాటింగ్‌ను కొనియాడాడు.
కాగా 47 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించింది. హ్యారీ బ్రూక్ 91 పరుగులతో ఉండగా.. జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. స్టోక్స్ బృందం చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.
చదవండి: కోహ్లి, అజారుద్దీన్ కాదు!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?