
PC: X
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root)కు కోపమొచ్చింది. టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు ఓవల్‌లో గురువారం మొదలైంది.
టీమిండియా నామమాత్రపు స్కోరు
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగి గిల్ సేన నామమాత్రపు స్కోరుకు పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్‌ను ఆలౌట్ చేసిన తర్వాత.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
శుభారంభం అందించిన ఓపెనర్లు
ఓపెనర్లలో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ (57 బంతుల్లో 64)తో అదరగొట్టగా.. బెన్ డకెట్ (38 బంతుల్లో 43) కూడా రాణించాడు. బజ్‌బాల్ ఆటతో చెలరేగిన ఓపెనర్లలో డకెట్‌ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపగా.. క్రాలీని ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కెప్టెన్ ఓలీ పోప్ (22)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 142 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌ను ప్రసిద్ కృష్ణ వేశాడు. అతడి బౌలింగ్‌లో క్రాలీ.. రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జో రూట్ అతడి స్థానంలో రాగా.. ప్రసిద్ అద్భుతమైన బౌలింగ్‌తో అతడిని తిప్పలు పెట్టాడు.
ఆఖరి బంతికి ఫోర్ బాదిన రూట్
ఆ ఓవర్లో తర్వాతి ఐదు బంతుల్లో (మూడోది నోబాల్) రూట్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. అయితే, ఆఖరి బాల్‌ను ప్రసిద్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా సంధించగా.. రూట్ దానిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు.
ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్
ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ ఏదో అనగా.. రూట్ ఎన్నడూ లేని విధంగా సీరియస్ అయ్యాడు. ప్రసిద్‌తో వాగ్వాదం చేస్తూనే అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అందుకు ప్రసిద్ కూడా గట్టిగానే బదులిచ్చినట్లు కనిపించింది. ఇంతలో అంపైర్ వచ్చి భారత పేసర్‌ను వివరణ అడిగినట్లు కనిపించింది.
దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ప్రసిద్‌కు మద్దతుగా నిలబడి.. అంపైర్‌తో వాదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి రూట్ ఇలా మైదానంలో సీరియస్ అవ్వడం అరుదు.
కానీ ఈసారి మాత్రం అతడు తీవ్రస్థాయిలో ప్రసిద్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఆకాశ్ దీప్.. బెన్ డకెట్ సాగనంపే క్రమంలో భుజంపై చెయ్యి వేసి మరీ సెండాఫ్ ఇచ్చిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక 33 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 33వ ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ బౌలింగ్‌లో రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బ్రూక్ 8 పరుగులతో ఉండగా.. జేకబ్ బెతెల్ క్రీజులోకి వచ్చాడు.
చదవండి: డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. పక్కకు లాక్కెళ్లిన రాహుల్.. వీడియో
Verbal spat between Prasidh krishna and joe root.#INDvsENGTest pic.twitter.com/6cbJCa7IVd
— U' (@toxifyy18) August 1, 2025