
PC: X
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ (Ben Duckett) బజ్‌బాల్ ఆటతో భారత బౌలర్లకు స్వాగతం పలికారు. టీ20 ఫార్మాట్ తరహాలో ర్యాంప్, స్కూప్ షాట్లతో చెలరేగిపోయారు. వీరిద్దరి జోరును నిలువరించేందుకు టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.
ఈ క్రమంలో డకెట్ అత్యుత్సాహం ప్రదర్శించగా.. ఆకాశ్ దీప్ (Akash Deep) అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఆకాశ్ దీప్.. ఐదో బంతిని ఫుల్ డెలివరీగా సంధించాడు. అయితే, బంతిని అంచనా వేయడంలో పొరపడ్డ డకెట్.. రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) చేతుల్లో పడింది. దీంతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో డకెట్.. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై వెనుదిరగాల్సి వచ్చింది.
డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్..
ఇక డకెట్ అవుట్ కాగానే.. ‘సాధించాను’ అన్నట్లుగా ఆకాశ్ దీప్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం క్రీజును వీడుతున్న డకెట్ భుజంపై చెయ్యి వేసి.. అతడితో ఏదో అన్నాడు.
పక్కకు లాక్కెళ్లిన రాహుల్
ఇందుకు సదరు బ్యాటర్ కూడా సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. ఇంతలో కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్‌ను అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు ఓవల్ మైదానంలో మొదలైంది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 224 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ధనాధన్
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టాననికి 109 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్‌కు వెళ్లేప్పటికి ఓపెనర్ జాక్ క్రాలీ 52, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఓలీ పోప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలీతో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డకెట్.. 38 బంతుల్లో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలిచింది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించగా.. మాంచెస్టర్ టెస్టు డ్రా అయింది. ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి. లేదంటే.. ఇంగ్లండ్‌కు సిరీస్ సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
చదవండి: బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్
AKASHDEEP REACTION AFTER GETTING BEN DUCKETT. 🤣#akashdeep #benduckett #INDvsENG pic.twitter.com/mZQ8SRNc91
— Ritika Singh (@Ritikasinggh) August 1, 2025