
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జైస్వాల్ టెక్నిక్ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. అతడు ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడని.. అట్కిన్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో జైసూ పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు.
బిక్కముఖం వేశాడు
ఈ మేరకు.. ‘‘జైస్వాల్ ఎన్నటికీ సాయి సుదర్శన్ కాలేడు. అయినా వీళ్లిద్దరిని పోల్చడం సరికాదనుకోండి. కానీ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో జైస్వాల్ అవుటైన తీరును చూస్తే.. అతడికి ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియక బిక్కముఖం వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలన్న గేమ్ ప్లాన్ అతడి వద్ద లేనట్లే అనిపించింది. నీ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు లేకపోతే ఇలాగే అవుట్ అయిపోతావు. బంతిని అతడు సరిగ్గా అంచనా వేయలేదు. డిఫెండ్ చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇప్పటికైనా జైస్వాల్ తన టెక్నిక్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 108 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. చెన్నైకి చెందిన సాయి కూడా యశస్వి జైస్వాల్ మాదిరే లెఫ్టాండ్ బ్యాటర్ అన్న విషయం తెలిసిందే.
తొలి రోజు ఇంగ్లండ్‌దే పైచేయి
ఇదిలా ఉంటే.. ఓవల్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 64 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించాడు.
అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (21) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిసిన రవీంద్ర జడేజా (9) ఈసారి విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (19) తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరుణ్ నాయర్ 52, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన ఈ సిరీస్‌ను కనీసం సమం చేయగలుగుతుంది. ఇక ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 101, 4, 87, 28, 13, 0, 58, 0, 2.
చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు