టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుబ్‌మన్ గిల్ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్‌కు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).
అయితే, పూర్తి స్థాయి కెప్టెన్‌గా గిల్ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో టెస్టుల్లో వైట్‌వాష్ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్ తొలిసారి 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.
అశూ స్పందన ఇదే
తాజాగా గిల్ సేనకు న్యూజిలాండ్ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.
ధోని, రోహిత్‌లను చూసి నేర్చుకో
కివీస్ సిరీస్‌లో ముఖ్యంగా ఇండోర్‌లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!
వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్‌కు ఏ బౌలర్‌తో బౌలింగ్ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్‌తో సిరీస్‌లో ఇది మిస్సయింది.
ఎంతమాత్రం సరికాదు
ఈ విషయంలో గిల్ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్‌కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్ ఫిలిప్స్ ఫాస్ట్ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బరిలోకి దించలేదు.
అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. డారిల్ మిచెల్ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం.
ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్.. గిల్ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.
చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
వాళ్లను పక్కనపెడతారా?: గిల్‌పై రహానే, జహీర్ ఖాన్ ఫైర్!


