న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.
ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలు
డారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్‌బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.
వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు
‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్‌తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.
అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.
మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే
ఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.
అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్‌తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్‌కు వన్డే సిరీస్‌నూ కోల్పోయింది.


