ఫాస్టెస్ట్‌ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్‌.. ఇంగ్లండ్‌ తొలి ప్లేయర్‌గా.. | Ind vs Eng 2nd Test Jamie Smith Slams 3rd Fastest 100 For England | Sakshi
Sakshi News home page

ఫాస్టెస్ట్‌ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్‌.. ఇంగ్లండ్‌ తొలి ప్లేయర్‌గా..

Jul 4 2025 5:44 PM | Updated on Jul 4 2025 6:49 PM

Ind vs Eng 2nd Test Jamie Smith Slams 3rd Fastest 100 For England

టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్‌ స్టార్‌ జేమీ స్మిత్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.

ఇంగ్లండ్‌ తొలి ప్లేయర్‌గా..
అంతేకాదు.. టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఓ రోజు ఆటలో భోజన విరామానికి ముందు సెషన్‌లోనే వందకు పైగా పరుగులు స్కోరు చేసిన ఇంగ్లండ్‌ తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు జేమీ స్మిత్‌. అతడి శతక ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక భారత యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్‌ ఏకంగా 23 పరుగులు పిండుకోవడం విశేషం.

టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్లు
🏏గిల్బర్ట్‌ జెసప్‌- 1902లో ది ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో శతకం
🏏జానీ బెయిర్‌ స్టో- 2022లో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా న్యూజిలాండ్‌పై 77 బంతుల్లో శతకం
🏏హ్యారీ బ్రూక్‌- 2022లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌పై 80 బంతుల్లో శతకం
🏏జేమీ స్మిత్‌- 2025లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా టీమిండియాపై 80 బంతుల్లో శతకం
🏏బెన్‌ స్టోక్స్‌- 2015లో లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌పై 85 బంతుల్లో శతకం.

 

లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు: 249/5 (47)
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్టు మొదలైంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రెండో రోజు ఆటలో భాగంగా 587 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్‌ (87) కూడా అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ మూడు వికెట్లు తీయగా.. క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. అదే విధంగా... కెప్టెన్‌ స్టోక్స్‌, బ్రైడన్‌ కార్స్‌, జో రూట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌.. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టపోయి 77 పరుగులు చేసింది. 

ఇక శుక్రవారం నాటి ఆటలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌.. హ్యారీ బ్రూక్‌, జేమీ స్మిత్‌ బజ్‌బాల్‌ ఇన్నింగ్స్‌ కారణంగా భోజన విరామ సమయానికి 249 పరుగులు స్కోరు చేసింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి స్మిత్‌ 102, బ్రూక్‌ 91 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ మూడు వికెట్లు కూల్చగా.. ఆకాశ్‌ దీప్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ టీమిండియా కంటే ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్‌ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement