
క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్లలో టీమిండియా ఒకటి. భారత జట్టు ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్లిప్స్, గల్లీ పాయింట్‌లో టీమిండియా ఫీల్డింగ్‌కు తిరుగులేదు. 2023 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు ఈ పాయింట్లలో క్యాచ్‌లు పట్టడంలో 80.6 శాతం మేర విజయవంతమైంది.
ఈ గణాంకాల జాబితాలో టీమిండియా తర్వాత న్యూజిలాండ్ 78.5 శాతం, శ్రీలంక 78.3 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది.
ఫీల్డింగ్ వైఫల్యంపై విమర్శలు
ఈ నేపథ్యంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో పాటు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో జైసూ ఏకంగా నాలుగు క్యాచ్‌లు మిస్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
క్రిక్‌విజ్ కథనం ప్రకారం.. 2006 నుంచి ఉన్న డేటాను గమనిస్తే.. భారత్ ఇలా ఓ టెస్టు మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు మిస్ చేయడం ఇది మూడోసారి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు పట్టడంలో 52.9 శాతం మాత్రమే విజయవంతమైంది.
నిజానికి.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఆడుతున్న సమయంలో స్లిప్స్‌లో క్యాచ్‌లు అందుకోవడంలో భారత్ విజయశాతం అధికంగా ఉండేది. ముఖ్యంగా వీరిలో స్లిప్ ఫీల్డర్‌గా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నది రాహుల్ ద్రవిడ్‌కే!..
భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?
స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం, క్యాచ్‌లు అందుకోవడం ఓ కళ. ఇందులో నంబర్ వన్ భారత ప్లేయర్‌గా ద్రవిడ్ పేరు చెప్పవచ్చని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పడం ఇందుకు నిదర్శనం. టెస్టు క్రికెట్‌లో ద్రవిడ్ స్లిప్స్ ఫీల్డర్‌గా ఏకంగా 210 క్యాచ్‌లు అందుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అటాకింగ్‌లో ఉన్నపుడు అతడు మరింత గొప్పగా రాణించేవాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కాగా.. భారత క్రికెట్‌లో ద్రవిడ్‌దే అగ్రస్థానం.
టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ కూడా ద్రవిడ్ ఫీల్డింగ్ నైపుణ్యాల నుంచి గతంలో కొనియాడాడు. ‘‘2000 సంవత్సరంలో నేను టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు తొలి టెస్టులోనే స్లిప్స్‌లో మూడు- నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశాం.
అయితే, ద్రవిడ్ ఫస్ట్ స్లిప్‌లోకి వచ్చిన తర్వాతే మా క్యాచింగ్ ప్రదర్శన మెరుగుపడింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడి వల్లే ఎక్కువ సక్సెస్ రేటు సాధించగలిగాం’’ అని జాన్ రైట్ ద్రవిడ్‌ను ప్రశంసించాడు.
వీరు కూడా..
ఇక ద్రవిడ్‌తో పాటు మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, అజింక్య రహానేలతో పాటు.. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ ఫీల్డింగ్ పొజిషన్‌లో మెరుగ్గా రాణించాడు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ద్రవిడ్, అజారుద్దీన్ వంటి దిగ్గజాల ఫీల్డింగ్ వీడియోలు చూస్తే.. స్లిప్ ఫీల్డింగ్ ఎలా చేయాలో.. వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో యువ ఆటగాళ్లకు అవగాహన వస్తుంది.
తద్వారా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. లేదంటే.. లీడ్స్ టెస్టు మాదిరి గెలవాల్సిన మ్యాచ్‌లో.. ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!