
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పెదవి విరిచాడు. రోజురోజుకు మెరుగుపడాల్సి పోయి.. జట్టు తిరోగమనంలో పయనించేలా సెలక్టర్ల నిర్ణయం ఉందంటూ విమర్శించాడు.
ఇలాంటి జట్టుతో ఆసియా కప్ గెలిచే అవకాశం ఉంటుందేమో గానీ.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో మాత్రం అస్సలు గెలవలేరని చిక్కా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ ఈవెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.
అక్షర్‌పై ‘వేటు’.. గిల్ రీ ఎంట్రీ
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. రీఎంట్రీలో శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా సూర్య డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ (Axar Patel)కు భంగపాటు తప్పలేదు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేశారు.
సిరాజ్‌కు దక్కని చోటు
ఇక ఈ జట్టులో హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. అయితే, యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాతో పాటు.. ఇటీవలి కాలంలో అంతగా ఆకట్టుకోని శివం దూబే, రింకూ సింగ్‌లను కూడా సెలక్టర్లు ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఈ పరిణామాలపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు.
ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు
‘‘ఈ జట్టుతో మనం మహా అయితే ఆసియా కప్ గెలుస్తామేమో!.. కానీ ఇదే జట్టును కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్ మాత్రం గెలవలేము. మీరు ఈ జట్టును వరల్డ్‌కప్ టోర్నీకి తీసుకెళ్తారా?.. ఐసీసీ టోర్నీకి ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. మరి మీ సన్నాహకాలు మాత్రం సరైన విధంగా లేవు.
ఎవరైనా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కానీ మీరు జట్టును తిరోగమనంలో పయనించేలా చేస్తున్నారు. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారు?.. రింకూ సింగ్, శివం దూబే, హర్షిత్ రాణాను ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.
ఐపీఎల్ ప్రదర్శన మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు ప్రామాణికం అని భావిస్తే.. మరి వీళ్లను ఎలా సెలక్ట్ చేసినట్లు?.. అసలు ఈ జట్టులో ఎవరు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?
ఆ ముగ్గురు ఎందుకు?
వికెట్ కీపర్లుగా ఉన్న సంజూ శాంసన్, జితేశ్ శర్మ.. లేదంటే శివం దూబే, రింకూ సింగ్‌లలో ఒకరు ఐదో నంబర్ బ్యాటర్‌గా వస్తారా? సాధారణంగా హార్దిక్ పాండ్యా ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక అక్షర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయలేడు.
మరి ఈ దూబేను ఎందుకు సెలక్ట్ చేశారో అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ఇంతకంటే ఇంకేం చేస్తే అతడిని జట్టుకు ఎంపిక చేసేవారు?’’ అంటూ చిక్కా సెలక్టర్ల తీరును ఎండగడుతూ.. ప్రశ్నల వర్షం కురిపించాడు. కాగా చివరగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఐదు మ్యాచ్‌లలో కలిపి 83 పరుగులు చేయగా.. రింకూ రెండు ఇన్నింగ్స్ ఆడి 39 రన్స్ చేశాడు.
చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్