
భారత క్రికెట్ జట్టు ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20లు సిరీస్‌లలో తలపడనుంది. ఈ సిరీస్‌లకు శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. అంతేకాకుండా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించారు. ఈ రెండు నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం వన్డే ప్రపంచకప్-2027ను దృష్ట్యా నాయకత్వ మార్పు అవసరమంటూ రోహిత్‌పై వేటు వేశారు. దీంతో అతడి అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు.
మరోవైపు జడేజాను కూడా జట్టు నుంచి తప్పించడాన్ని క్రికెట్ నిపుణులు తప్పబడుతున్నారు. జడేజా లాంటి మ్యాచ్ విన్నర్‌ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జడేజాను ఎంపిక చేయకపోవడంపై టీమ్ ప్రకటన సందర్భంగా ఛీప్ సెలక్టర్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియా కండీషన్స్‌కు జడేజా సరిపోడు అని అతడు చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఒక ఎడమచేతి వాటం స్పిన్నర్ (స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్) మాత్రమే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాము. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఆడే అవకాశం లేదు. ఆసీస్ పిచ్‌లు అక్షర్‌కు సరిగ్గా సరిపోతాయి. అందుకే రవీంద్ర జడేజా బదులుగా అక్షర్ తీసుకున్నాము.
రవీంద్ర జడేజా ఎల్లప్పుడూ మా ప్రణాళికలలో ఉంటాడు. అతడొక అద్భుతమైన ఆల్‌రౌండర్. మంచి ఫీల్డర్ కూడా అని అగార్కర్ పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికి జడేజా లాంటి ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయం కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
శనివారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులో జడ్డూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఓ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. కానీ కాసేపటికే ఆసీస్ టూర్‌కు చోటు దక్కకపోవడం జడేజాను నిరాశపరిచింది.
చదవండి: అందుకే రోహిత్ శర్మపై వేటు.. అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే: అగార్కర్