PC: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.
ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్‌ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్‌గా నియమించాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతడొక డమ్మీ కెప్టెన్..
రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.
‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.

అంతా ధోని కనుసన్నల్లోనే
గైక్వాడ్‌ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్‌గా, కెప్టెన్‌గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్‌గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.
కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ధోని వారసుడిగా
కాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్‌లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు.
దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు.
చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!


