ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. తమ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉన్న క్రికెటర్లను కూడా వేలంలోకి విడిచిపెట్టాయి.
టాటా.. బైబై
ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ తమ అత్యంత ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌తో పాటు.. చాలా ఏళ్లుగా జట్టుతో కొనసాగుతున్న దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌కు స్వస్తి పలికింది. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ (Quinto De Kock)ను కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది.
మరోవైపు.. పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell)ను వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (Ravi Bishnoi)ని వదిలించుకుంది. అదే విధంగా.. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్‌ను కూడా రిలీజ్ చేసింది.
వదిలేశారు
ఇక చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఊహించని రీతిలో శ్రీలంక యువ పేసర్, ధోని ప్రియ శిష్యుడిగా పేరొందిన మతీశ పతిరణను వేలంలోకి వదిలింది. రాహుల్ త్రిపాఠి సేవలకు కూడా గుడ్‌బై చెప్పింది.
అదే విధంగా ఈ సీజన్‌తో ట్రోఫీ గెలవాలన్న కల నెరవేర్చుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మయాంక్ అగర్వాల్‌ను వదిలివేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభినవ్ మనోహర్‌కు టాటా చెప్పేసింది. రాజస్తాన్ రాయల్స్ ఆకాశ్ మధ్వాల్‌కు వీడ్కోలు పలకగా.. అరంగేట్రంలోనే దుమ్ములేపిన కేరళ బౌలర్ విఘ్నేశ్ పుతూర్‌ను వదిలేసింది.
ఫ్రాంఛైజీలు వదిలేసిన ఈ పదకొండు ఆటగాళ్లు కలిస్తే గొప్ప ప్లేయింగ్ ఎలెవన్‌ను తయారు చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. వీళ్లంతా కలిసి ఉండే తుదిజట్టుతో ప్రత్యర్థి జట్టును వణికించవచ్చని అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఎవరెవరు ఏ స్థానంలో సరిపోతారంటే?
టాపార్డర్
క్వింటన్ డికాక్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా బెస్ట్ ఆప్షన్. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఓపెనర్‌గానూ విధ్వంసం సృష్టించగలడు. ఇక అతడికి తోడుగా మయాంక్ అగర్వాల్ కొత్త బంతిని ఎదుర్కోవడంలో సత్తా చాటగలడు. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి కుదురుకున్నాడంటే అతడికి తిరుగు ఉండదు.
మిడిలార్డర్‌లో పవర్ హిట్టర్స్
ఇక త్రిపాఠి తర్వాతి స్థానంలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భేష్. ఐదో స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ పవర్‌హిట్టర్‌గా దంచేయగలడు. ముఖ్యంగా స్పిన్‌ను ఈ ఆల్‌రౌండర్ సమర్థంగా ఎదుర్కోగలడు. అదే విధంగా.. ఆఫ్ స్పిన్‌తో బౌలింగ్ విభాగంలోనూ సేవలు అందించగలడు.
ఆరో స్థానంలో ఆండ్రీ రసెల్‌ను మించిన వీరుడు ఎవరూ ఉండరు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడే ఈ విండీస్ దిగ్గజం ఫినిషర్‌గా సత్తా చాటగలడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు.
బౌలింగ్ విభాగం.. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్
డెత్ ఓవర్లలో లంక పేసర్ మతీశ పతిరణ స్పెషలిస్టు బౌలర్‌గా దుమ్ములేపగలడు. అతడికి తోడుగా ఆకాశ్ మధ్వాల్ ఉంటే సరి. ఇక ఆకాశ్ దీప్ కొత్త బంతితో స్వింగ్ రాబట్టి ప్రత్యర్థులను భయపెట్టగలడు. పవర్ ప్లేలో కెప్టెన్ అనుకున్న ఫలితాన్ని రాబట్టగలడు.
స్పిన్నర్ల కోటాలో రవి బిష్ణోయి నాయకుడిగా ఉంటే.. విఘ్నేశ్ పుతూర్ ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా అతడికి తోడుగా ఉండగలడు. మిడిల్ ఓవర్లలో ఇద్దరూ చక్కగా బంతిని రొటేట్ చేసుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే జట్టుకు తిరుగు ఉండదు.
ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్
క్వింటన్ డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆండ్రీ రసెల్, అభినవ్ మనోహర్, ఆకాశ్ మధ్వాల్, రవి బిష్ణోయి, ఆకాశ్ దీప్, మతీశ పతిరణ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: విఘ్నేశ్ పుతూర్.
చదవండి: సాయి, పడిక్కల్ కాదు!.. గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు
పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే


