టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ (PC: BCCI)
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి మండిపడ్డాడు. సీనియర్ ఆటగాళ్ల విషయంలో మేనేజ్‌మెంట్ వైఖరి సరిగా లేదని విమర్శించాడు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని సాకులు చెబుతూ కావాలనే పక్కకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఇక అతడు టెస్టులు ఆడి రెండేళ్లకు పైగానే గడిచిపోయింది. అంతర్జాతీయ టీ20లలో కూడా షమీకి ప్రాధాన్యం దక్కడం లేదు. అయితే, వన్డేల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచి మేనేజ్‌మెంట్ అతడిని పక్కనపెట్టింది.
మాటల యుద్ధం
ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- షమీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. షమీ ఫిట్‌గా లేడంటూ అగార్కర్ చెప్పగా.. రంజీల్లో బెంగాల్ తరఫున వికెట్లు తీస్తూ షమీ ఆటతో కూడా అతడికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇక రంజీల్లో సత్తా చాటినప్పటికీ సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ మాజీ ఆటగాడు మనోజ్ తివారి తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా సర్కిల్‌లో పరస్పర నమ్మకం, అర్ధం చేసుకునే తత్వం కొరవడిందని అనిపిస్తోంది. దేశీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ నిలకడగా ఆడుతూ వికెట్లు తీస్తున్నాడు.

కానీ టెస్టులకు అతడిని అసలు ఎంపిక చేయడమే లేదు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలకు కూడా అతడిని సెలక్ట్ చేయలేదు. షమీ ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ లేదని చీఫ్ సెలక్టర్ బహిరంగంగా చెబుతాడు.
అది ఎవరి పని?
అయినా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి అడగాల్సిన బాధ్యత ఎవరిదో అతడికి తెలియదా?.. ఫిజియోలు, ట్రెయినర్లు ఏం చేస్తున్నారు? వారే కదా ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి ఆరా తీసి సెలక్టర్లకు చెపాల్సింది. ఇప్పటికైనా మీకు ఫోన్లను కాస్త వాడండి. ఆటగాళ్లకు కాల్ చేసి వారి నుంచి సమాధానం తెలుసుకోండి.
షమీ చాలా ఏళ్లుగా జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడికి కనీస గౌరవం ఇవ్వండి. అతడికి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. కోచ్, సెలక్షన్ కమిటీ నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత అది’’ అని మనోజ్ తివారి టీమిండియా మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు.
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. కోల్‌కతా వేదికగా తొలిటెస్టులో సఫారీ జట్టు చేతిలో ముప్పై పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటి వేదిక.
చదవండి: IPL 2026: ‘సన్‌రైజర్స్‌కు అతడు దొరకడు.. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’


