
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ఖరారు చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ మెగా ఈవెంట్ ఆడబోయే జట్టును మంగళవారం ప్రకటించింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఆసియా కప్ ఆడబోయే భారత జట్టులోని సభ్యుల పేర్లు వెల్లడించాడు. ఈ ఖండాంతర టోర్నీతో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయనున్నాడు.
ఓపెనింగ్ జోడీ ఎవరు?
అంతేకాదు.. సూర్యకు డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా గిల్ ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.
అయితే, ప్రస్తుత ఆసియా కప్ జట్టులో సంజూకు చోటు దక్కినా.. గిల్ రాకతో ఓపెనర్‌గా అతడిపై వేటు పడటం ఖాయమే కనిపిస్తోంది. కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే అతడి పేరును పరిశీలనలోకి తీసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేయడంతో సంజూకు కాస్త ప్రమాదం తప్పినట్లే విశ్లేషకులు అంటున్నారు.
అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్
ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘‘శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టి సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చాడు.
అలాగే అభిషేక్ శర్మ కూడా!.. అయితే, ఓపెనర్‌గా అభిషేక్ అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గానూ పనికివస్తాడు. ఇక అభిషేక్ శర్మకు జోడీగా ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు.
అక్కడకు వెళ్లాకే నిర్ణయం
శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్.. ఈ ఇద్దరూ మంచి ఓపెనింగ్ బ్యాటర్లు.అయితే, దుబాయ్‌లో ఓపెనర్‌గా ఎవరు వస్తారని అక్కడే నిర్ణయిస్తాం. ఇక గిల్ అంతకు ముందు కూడా వైస్ కెప్టెన్‌గా జట్టులో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇందులో ఎలాంటి సమస్య లేదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.
ఈ క్రమంలో అభిషేక్ శర్మను మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా చెప్పిన అగార్కర్.. గిల్ రాకతో సంజూపై ఓపెనర్‌గా వేటు పడక తప్పదనే సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆసియా కప్-2025కి ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.
చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్