ఆసియా కప్‌-2025: ఇది కరెక్ట్‌ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం | Asia Cup IND vs BAN: Suryakumar Roasted Over Sanju Move SKY Reacts | Sakshi
Sakshi News home page

ఇది కరెక్ట్‌ కాదు సూర్య!.. ఈసారి వర్కౌట్‌ కాలేదు.. మేము మాత్రం ఇంతే!

Sep 25 2025 2:05 PM | Updated on Sep 25 2025 2:56 PM

Asia Cup IND vs BAN: Suryakumar Roasted Over Sanju Move SKY Reacts

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో టీమిండియా మరోసారి తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది. లీగ్‌ దశలో ఒమన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ దిగని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఓపెనింగ్‌ జోడీ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)- శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)లను మినహా దాదాపుగా అందరి స్థానాలు మార్చాడు.

అపుడు అలా.. ఇపుడు ఇలా
సంజూ శాంసన్‌ (Sanju Samson)ను వన్‌డౌన్‌లో.. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌లను బరిలోకి దించాడు. తాజాగా సూపర్‌-4లో బంగ్లాదేశ్‌తో కీలకమైన బుధవారం నాటి మ్యాచ్‌లోనూ భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు జరిగాయి.

ఓపెనర్లుగా అభి (37 బంతుల్లో 75)- గిల్‌ (19 బంతుల్లో 29)లను కొనసాగించిన యాజమాన్యం.. ఆల్‌రౌండర్‌, ఫినిషర్‌ శివం దూబే (2)ను వన్‌డౌన్‌లో పంపగా విఫలమయ్యాడు. తనదైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య (5) కూడా విఫలమయ్యాడు. హార్దిక్‌ పాండ్యా (38) ఐదు, తిలక్‌ వర్మ (5) ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయగా.. అక్షర్‌ పటేల్‌ (10 నాటౌట్‌) ఏడో ఆటగాడిగా వచ్చాడు.

ఇక సంజూ శాంసన్‌ను ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి బ్యాటింగ్‌ చేయాల్సింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. వీరంతా మైదానంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇదెలాంటి క్రికెట్‌ లాజిక్‌?
అయితే, బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో భారత్‌ నామమాత్రపు స్కోరు చేయడం.. ఆ తర్వాత 41 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలపై కెప్టెన్‌ సూర్యకుమార్‌పై విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా ఓ వైపు వికెట్లు పడుతున్నా సంజూ శాంసన్‌ ఎనిమిదో స్థానంలో దింపాలనుకోవడంపై భారత మాజీ క్రికెటర్‌ దొడ్డ గణేశ్‌ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘సంజూ శాంసన్‌ ఎనిమిదో స్థానంలో రావడమా? ఇదెలాంటి క్రికెట్‌ లాజిక్‌. ఇది ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు’’ అంటూ సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై విజయానంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. విమర్శలకు బదులు ఇచ్చాడు. ‘‘ఈ టోర్నీలో మాకు తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ఒమన్‌పై మొదట బ్యాటింగ్‌ చేశాం. మళ్లీ ఇప్పుడు. సూపర్‌-4లో అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నాం.

మేమిలాగే చేస్తాం
బంగ్లా బౌలింగ్‌ లైనప్‌ చూసిన తర్వాతే మా బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు చేసుకున్నాం. వారి జట్టులో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌, లెగ్‌ స్పిన్నర్‌ ఉన్నారు. దూబే స్పిన్‌ బాగా ఆడతాడనే అతడిని ముందుగా పంపించాం.

కానీ ఈసారి అది వర్కౌట్‌ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అంతమాత్రాన మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవుట్‌ఫీల్డ్‌ ఇంకాస్త మెరుగ్గా ఉంటే మేమే 180- 185 పరుగులు చేసేవాళ్లం. 

ఇక 12- 14 ఓవర్లు బాగా బౌలింగ్‌ చేసిన సందర్భాల్లోనూ మేము మెజారిటీ మ్యాచ్‌లలో గెలుపొందాం’’ అని తన నిర్ణయాన్ని సూర్య సమర్థించుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక.. టీమిండియా తదుపరి శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. ఇందుకు దుబాయ్‌ వేదిక.

 

చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. బీసీసీఐ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement