
ఒమన్ క్రికెట్ జట్టుపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ఆద్యంతం అద్బుత పోరాటపటిమ కనబరిచారని కొనియాడాడు. ఇందుకు ప్రధాన కారణం వారి కోచ్ సులక్షణ్ కులకర్ణి అంటూ సూర్య ప్రశంసించాడు.
ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భారత్, పాకిస్తాన్, యూఏఈతో పాటు ఒమన్ గ్రూప్-ఎ నుంచి పోటీపడింది. పాక్, యూఏఈ చేతిలో ఓడిన ఒమన్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో మరో పరాజయాన్ని చవిచూసింది. అయితే, పటిష్ట భారత జట్టుతో ఒమన్ బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రాణించి గట్టిపోటీనివ్వడం విశేషం.
నమ్మశక్యం కాని రీతిలో..
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఒమన్ అద్భుతంగా ఆడింది. వారి ఆట నన్ను ఆకట్టుకుంది. నమ్మశక్యం కాని రీతిలో ఆడారు. వారి కోచ్ సులూ సర్ వల్లే ఇది సాధ్యమైంది.
ఆయన వారిలో పట్టుదలకు కారణం. ప్రత్యర్థి ముందు తేలికగా తలవంచకూడదనే ధైర్యాన్ని నూరిపోశారు. ఒమన్ జట్టు బ్యాటింగ్ చేస్తుంటూ చూడముచ్చటగా అనిపించింది’’ అని కితాబు ఇచ్చాడు.
కాస్త కష్టంగానే ఉంటుంది
ఇక యూఏఈ, పాక్ జట్లతో మ్యాచ్‌లతో బెంచ్‌కే పరిమితమైన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఒమన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడిన విషయం తెలిసిందే. అర్ష్‌దీప్ నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. హర్షిత్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 25 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒమన్ వంటి జట్టుకు కూడా వీరు పరుగులు ధారాళంగా సమర్పించుకోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే, సూర్య మాత్రం వారిద్దరికి అండగా నిలిచాడు. ‘‘అకస్మాత్తుగా బెంచ్ నుంచి వచ్చి ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది’’ అని అర్ష్‌దీప్, హర్షిత్‌లను వెనకేసుకువచ్చాడు. ఇక తదుపరి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
ఆసియా కప్-2025: భారత్ వర్సెస్ ఒమన్ స్కోర్లు
👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి
👉టాస్: భారత్.. తొలుత బ్యాటింగ్
👉భారత్ స్కోరు: 188/8 (20)
👉ఒమన్ స్కోరు: 167/4 (20)
👉ఫలితం: ఒమన్‌పై 21 పరుగుల తేడాతో భారత్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)
చదవండి: IND vs OMAN: సూర్యకుమార్ అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదే
Aamir Kaleem, take a bow 🫡
An innings that will go down in Oman cricket history 🇴🇲
Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/4nqXWJCDYH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025