
ఒమన్‌పై 21 పరుగులతో గెలుపు
పోరాడి ఓడిన కూన
సామ్సన్ అర్ధ సెంచరీ
రేపు పాక్‌తో టీమిండియా పోరు
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో లీగ్ దశను భారత్ అజేయంగా ముగించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి తమతో తలపడిన చిన్న జట్టు ఒమన్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. బ్యాటర్ల పట్టుదలతో ఒమన్ కొంత పోరాడగలిగినా... టీమిండియా ముందు అది సరిపోలేదు. శుక్రవారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 21 పరుగులతో గెలుపొందింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (45 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది.
ఆమిర్ కలీమ్ (46 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టోర్నీలో నేటి నుంచి సూపర్–4 దశ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. తొలి పోరులో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుండగా ... ఆదివారం పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది.
రాణించిన అభిషేక్, తిలక్...
శుబ్‌మన్ గిల్ (5) త్వరగానే వెనుదిరిగినా... అభిషేక్ మరోసారి తనదైన రీతిలో దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించాడు. షకీల్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను నదీమ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదాడు. సామ్సన్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్ 60 పరుగులు చేసింది. అయితే రామనంది వేసిన ఓవర్లో ముందు అభిషేక్ అవుట్ కాగా... రెండు బంతుల తర్వాత దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు.
సామ్సన్ కొట్టిన షాట్‌కు బంతి బౌలర్ చేతికి తాకుతూ స్టంప్స్‌ను పడగొట్టడంతో పాండ్యా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకదశలో నాలుగు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, సిక్స్ బాదిన అక్షర్‌ను వెంటనే వెనక్కి పంపడంతో ఒమన్‌సఫలమైంది. శివమ్ దూబే (5) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, తన సహజశైలికి భిన్నంగా ఆడిన సామ్సన్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మరో వైపు క్రీజ్‌లో ఉన్నంత సేపు తిలక్ ధాటిని ప్రదర్శించాడు. అయితే వరుసగా వికెట్లు పడుతూ ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినా కూడా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం చివరి వరకు బ్యాటింగ్‌కు రాలేదు!
కలీమ్, మీర్జా అర్ధసెంచరీలు...
భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌కు సరైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు జతీందర్, కలీమ్ జాగ్రత్తగా ఆడి తొలి 6 ఓవర్లలో 44 పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు తొలి వికెట్‌కు 52 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ఒమన్ సఫలమైంది.
ఈ క్రమంలో 38 బంతుల్లో కలీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒమన్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. కలీమ్‌కు తోడు మీర్జా కూడా ధాటిని ప్రదర్శించాడు. 55 బంతుల్లోనే వీరిద్దరు 93 పరుగులు జత చేయడం విశేషం. 30 బంతుల్లో మీర్జా అర్ధ సెంచరీ సాధించగా... ఆ తర్వాత చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి ఒత్తిడిలో ఒమన్ ఓటమి దిశగా పయనించింది.
1 అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్ దీప్ సింగ్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 25 మంది బౌలర్లు 100 వికెట్ల మైలురాయిని దాటారు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ (173 వికెట్లు) ‘టాప్’లో ఉన్నాడు.
స్కోరు వివరాలు:
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) శుక్లా (బి) రామనంది 38; గిల్ (బి) ఫైసల్ 5; సామ్సన్ (సి) బిష్త్ (బి) ఫైసల్ 56; పాండ్యా (రనౌట్) 1; అక్షర్ (సి) శుక్లా (బి) కలీమ్ 26; దూబే (సి) జతీందర్ (బి) కలీమ్ 5; తిలక్ (సి) జిక్రియా (బి) రామనంది 29; హర్షిత్ (నాటౌట్) 13; అర్ష్ దీప్ (రనౌట్) 1; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–6, 2–72, 3–73, 4–118, 5–130, 6–171, 7–176, 8–179. బౌలింగ్: షకీల్ 3–0–33–0, ఫైసల్ 4–1–23–2, నదీమ్ 1–0–19–0, రామనంది 4–0–32–2, శ్రీవాస్తవ 2–0–23–0, జిక్రియా 3–0–23–0, కలీమ్ 3–0–31–2.
ఒమన్ ఇన్నింగ్స్: జతీందర్ (బి) కుల్దీప్ 32; కలీమ్ (సి) పాండ్యా (బి) హర్షిత్ 64; హమ్మద్ (సి) (సబ్) రింకూ (బి) పాండ్యా 51; జిక్రియా (నాటౌట్) 0; శుక్లా (సి) (సబ్) రింకూ (బి) అర్ష్ దీప్ 1; రామనంది (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–149, 3–154, 4–155. బౌలింగ్: పాండ్యా 4–0–26–1, అర్ష్ దీప్ 4–0–37–1, హర్షిత్ 3–0–25–1, కుల్దీప్ 3–0–23–1, అక్షర్ 1–0–4–0, దూబే 3–0 –31–0, తిలక్ 1–0–8–0, అభిషేక్ 1–0–12–0.