
ఆసియా కప్-2025లో ఒమన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నామమాత్రపు మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సూర్య మాత్రం డగౌట్‌లోనే ఉండిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేస్తూ.. ఆల్‌రౌండర్లతో పాటు బౌలర్లను ముందుకు పంపాడు.
ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్‌మన్ గిల్(5)లను అలాగే కొనసాగించిన సూర్య.. వన్‌డౌన్లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)ను పంపాడు. నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా (1), ఐదో స్థానంలో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26)లను ఆడించాడు.
ఆ తర్వాత వరుసగా తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను పంపాడు. ఈ క్రమంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒమన్‌ను 167 పరుగులకు పరిమితం చేసి విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సూర్య తీసుకున్న నిర్ణయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో సూర్య బ్యాటింగ్ వస్తే కాసేపు ఫోర్లు, సిక్సర్లు కొట్టేవాడు. అతడికి అది మంచిది కూడా.
అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా సూర్యకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. తదుపరి అన్నీ కీలక మ్యాచ్‌లే. అందుకే ఒకవేళ టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోతే బ్యాటింగ్ పరిస్థితి ఏమిటన్నది చెక్ చేసేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కుల్దీప్ యాదవ్‌ను కూడా అందుకే బ్యాటింగ్‌కు పంపాడు. నిజంగా సూర్య వినూత్నమైన ఆలోచనలు గలవాడు. శ్రీలంకతో గతంలో ఓ మ్యాచ్‌లో తాను కూడా బౌలింగ్ చేశాడు. రింకూ చేతికి కూడా బంతినిచ్చాడు. తన నిర్ణయాలతో చేజారే మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించాడు.
ఇప్పుడు కూడా ప్రయోగం చేశాడు. తాను బ్యాటింగ్‌కు వెళ్లకుండా బౌలర్లు అర్ష్‌దీప్, కుల్దీప్‌లను ముందుకు పంపించాడు’’ అంటూ గావస్కర్ సూర్య నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసలు కురిపించాడు. కాగా లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా తదుపరి సూపర్-4 దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడనుంది.