నేడు శ్రీలంకతో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్
వన్డే వరల్డ్‌కప్ విజయం అనంతరం తొలిసారి బరిలోకి
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మైదానంలో అడుగు పెట్టనుంది. శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా తొలి పోరు జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా 11 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత జట్టు... ఈసారి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది.
అందుకు లంకతో సిరీస్‌ను ప్రాక్టీస్‌గా వినియోగించుకోవాలని చూస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లు కమలిని, వైష్ణవి శర్మను ఎంపిక చేశారు. 17 ఏళ్ల కమలిని ఇప్పటికే అండర్–19 ప్రపంచకప్‌తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటింది.
తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు వైష్ణవి అండర్–19 ప్రపంచకప్‌లో 17 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి వచి్చంది. రాధ యాదవ్ గైర్హాజరీలో ఈ 19 ఏళ్ల మీడియం పేసర్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఇక తెలుగమ్మాయి శ్రీచరణి మరోసారి కీలకం కానుంది. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు అడ్డంకులు ఎదుర్కొన్న స్మృతి మంధాన ఎలాంటి ప్రదర్శన చేస్తుందోచూడాలి.
క్రికెట్ కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదని ఇప్పటికే స్పష్టం చేసిన స్మృతిపై అందరి దృష్టి నిలవనుంది. ఇక అనూహ్యంగా వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకొని ఫైనల్లో అదరగొట్టిన షఫాలీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టు సైతం యువ ప్లేయర్లను పరీక్షించనుంది. 17 ఏళ్ల శశి్నని, 19 ఏళ్ల రషి్మక, 23 ఏళ్ల కావ్యను ఈ మ్యాచ్‌లో బరిలోకి దింపే అవకాశం ఉంది.


