టి20 ప్రపంచ కప్ అంపైర్లు, రిఫరీల ప్రకటన
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్‌లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్‌బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్‌లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్‌కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్‌గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్‌కు ఇది మూడు ఫార్మాట్‌లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది.
ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్‌గా అతను నిలవనున్నాడు. మదన్‌గోపాల్‌కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్‌కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్‌నీ, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్‌సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్‌లో పని చేయనున్నారు.


