కవెమ్ హడ్జ్ అజేయ శతక పోరాటం
వెస్డిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 381/6
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఓవర్‌నైట్ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.
కవెమ్ హడ్జ్ (254 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేయగా... జాన్ క్యాంప్‌బెల్ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్ గ్రేవ్స్ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్‌బెల్ అవుట్ కాగా... కాసేపటికే బ్రాండన్ కింగ్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో హడ్జ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్ అవుట్ కాగా... అలిక్ అథనజె, జస్టిన్ గ్రేవ్స్ సాయంతో హడ్జ్ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోస్టన్ చేజ్ (2) విఫలం కాగా... హడ్జ్‌తో పాటు అండర్సన్ ఫిలిప్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ షై హోప్... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఎజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విండీస్ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం.


