న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కైల్ జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేస్తాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆడమ్ మిల్నే గాయపడటంతో అప్పటివరకు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న జేమీసన్ ప్రధాన జట్టులోకి ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేశాడు. సియర్స్ ఫిబ్రవరి 5న ముంబైలో అమెరికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్‌లోపు జట్టుతో కలుస్తాడు.
సియర్స్‌కు ప్రపంచకప్ అవకాశం కల్పించడంపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. సియర్స్ చాలా కష్టపడి ఫిట్‌నెస్ సాధించాడని కితాబునిచ్చాడు. ప్రధాన జట్టులో ఎవరికైనా గాయాలైతే సియర్స్ మొదటి ఆప్షన్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు.
తాజాగా ముగిసిన న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్‌లో సియర్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి, రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీనికి ముందు కౌంటీ డివిజన్ వన్ టోర్నీలోనూ అతను సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లతో రాణించాడు. ఇప్పటివరకు 22 అంతర్జాతీయ టీ20లు ఆడిన సియర్స్ 23 వికెట్లు తీశాడు. 140 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం సియర్స్ ప్రత్యేకత. బౌన్స్ అతని అదనపు బలం.
టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధీ, బెన్ సియర్స్ (రిజర్వ్)
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో అఫ్గనిస్తాన్, కెనడా, దక్షిణాఫ్రికా, యూఏఈ మిగతా జట్లుగా ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది.
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదో టీ20 తిరువనంతపురం వేదికగా జనవరి 31న జరుగనుంది.


