
PC: X
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యవహార శైలిపై భారత మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. సూర్య తీరు విమర్శలకు దారితీసే విధంగా ఉందన్నాడు. అయితే, మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సూర్య చేసింది సరైన పనేనంటూ మద్దతు పలికాడు.
అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో బుధవారం తలపడింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
57 పరుగులకే ఆలౌట్
ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బౌలర్లు యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ నాలుగు, శివం దూబే మూడు వికెట్లు కూల్చగా.. అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ అలీషాన్ షరాఫూ (22) పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తి
ఇదిలా ఉంటే.. యూఏఈ పదో నంబర్ బ్యాటర్ జునైద్ సిద్దిఖీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ను శివం దూబే వేశాడు. ఒకటో బంతికి ధ్రువ్ పరాశర్ (1)ను దూబే అవుట్ చేయగా జునైద్ క్రీజులోకి వచ్చాడు.
ఈ క్రమంలో దూబే షార్ట్ డెలివరీ సంధించగా.. దానిని షాట్ ఆడబోయి జునైద్ విఫలమయ్యాడు. అయితే, దూబే బౌలింగ్ కోసం రన్ మొదలుపెట్టిన సమయంలో అతడి టవల్ జారి పడగా.. జునైద్ అటు వైపు చూసి సైగ చేశాడు. ఇంతలో బంతిని అందుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ దానిని వికెట్లకు గిరాటేశాడు.
అప్పీలును వెనక్కి తీసుకుని..
అప్పటికి జునైద్ క్రీజు బయట ఉండగా.. అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. అయితే, కెప్టెన్ సూర్య మాత్రం తమ అప్పీలును వెనక్కి తీసుకుని.. జునైద్‌ను తిరిగి బ్యాటింగ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు.
ఇలాంటివి అవసరమా సూర్య?
ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘పాకిస్తాన్‌తో సెప్టెంబరు 14 నాటి మ్యాచ్‌లో మాత్రం ఇలా అస్సలు జరిగి ఉండేది కాదు. సల్మాన్ ఆఘా.. 14 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు మ్యాచ్ రసవత్తరంగా ఉన్న వేళ.. సూర్య అస్సలు ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. సంజూ అద్భుతంగా స్పందించి వికెట్లను గిరాటేశాడు. అతడు చేసింది సరైన పని.
బ్యాటర్ క్రీజు బయట ఉన్నాడు కాబట్టి అది కచ్చితంగా అవుటే అని నా అభిప్రాయం. కానీ సూర్య ఇలా చేయడం వల్ల మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇలాంటివి జరిగితే అప్పుడు సూర్య అలా చేశాడు.. ఇలా చేశాడు అనే విమర్శలు వస్తాయి’’ అని పేర్కొన్నాడు.
ఇచ్చిపడేసిన సూర్య
అయితే, అజింక్య రహానే మాత్రం సూర్యను సమర్థించాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు అతడిని ప్రశంసించాలని సూచించాడు. క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరగవని.. ఏదేమైనా టీమిండియా మంచి పనే చేసిందని కితాబులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలో ఛేదించి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.
చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే..