
సంజూ- గంభీర్ (PC: BCCI)
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. గ్రూప్-‘ఎ’లో భాగమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తమ తొలి మ్యాచ్ ఆడిన భారత్.. పసికూనను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి మరోసారి సత్తా చాటింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. యూఏఈ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను.. కేవలం 4.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), శుబ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ రికార్డు విజయం సాధ్యమైంది.
వికెట్ కీపర్‌గా సేవలు
ఇదిలా ఉంటే.. యూఏఈతో ఆడిన భారత తుదిజట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే, గిల్ (Shubman Gill) గైర్హాజరీలో అంతర్జాతీయ టీ20లలో ఓపెనర్‌గా వచ్చిన సంజూ.. ఇప్పుడు మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. యూఏఈతో బుధవారం నాటి మ్యాచ్‌లో అతడు వికెట్ కీపర్‌గా సేవలు అందించగా.. బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూ పట్ల టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ల వైఖరిపై స్పందించాడు. ‘‘నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే, సంజూకు కెప్టెన్, కోచ్ ఇంతలా మద్దతునివ్వడం సంతోషంగా ఉంది.
నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే
సంజూ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. మీడియా సమావేశంలో తాము సంజూ గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని సూర్య చెప్పడం ఆనందదాయకం. ఇక సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే అతడు మిడిలార్డర్‌లో వస్తాడు.
పవర్ ప్లేలో త్వరగా వికెట్ కోల్పోతే సంజూ అప్పుడు బరిలోకి దిగుతాడు. అతడికి మంచి ప్రాధాన్యమే దక్కింది. ఏదేమైనా ఇది ప్రాజెక్ట్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు. నేను సంజూను ఇంటర్వ్యూ చేసినపుడు గంభీర్ తనతో ఏం చెప్పాడో సంజూ వివరించాడు.
‘నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. 22వ మ్యాచ్‌లో నీకు ఛాన్స్ ఉంటుంది’ అని గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని సంజూ చెప్పాడు. కోచ్, కెప్టెన్ ఓ ఆటగాడికి ఇలా అండగా నిలిస్తే అతడి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.
నిజంగా అద్భుతం
సంజూ నైపుణ్యాల పట్ల మేనేజ్‌మెంట్‌కు ఉన్న అవగాహన, నమ్మకం గురించి నాకు అప్పుడే అర్థమైంది. అతడి గురించి వారు ఆలోచించడం నిజంగా అద్భుతం’’ అని అశ్విన్.. సూర్య, గంభీర్‌లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టీ20 మ్యాచ్‌లు ఆడి 861 పరుగులు చేశాడు.
ఇందులో మూడు శతకాలు ఉన్నాయి ఇక ఆసియా టీ20 కప్-2025 కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం సంజూ తేలిపోయాడు. ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే, ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్‌లో భాగంగా సంజూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.