
టీమిండియా ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కాంపిటేటివ్ క్రికెట్ పునరాగమనంలో అదరగొట్టాడు. చెన్నై వేదికగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ అరంగేట్ర పోరులో సెంచరీ (141 బంతుల్లో 111; 15 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు.
ఈ సందర్భంగా పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా 2021లో టీమిండియా తరఫున చివరిగా ఆడిన ఈ ముంబై బ్యాటర్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.
వేటు వేసిన ముంబై సెలక్టర్లు
క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్ లేమి, అధిక బరువు తదితర కారణాల వల్ల దేశవాళీ క్రికెట్‌కూ పృథ్వీ దూరమయ్యాడు. ముంబై సెలక్టర్లు కీలక మ్యాచ్‌ల నుంచి అతడిని తప్పించడంతో పృథ్వీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో కూడా అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్‌కు సరైన వారసుడిగా కీర్తించబడిన పృథ్వీ కెరీర్.. అంతే వేగంగా పతనమైంది.
ఆదరించిన మహారాష్ట్ర
ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్‌లో ముంబై నుంచి మహారాష్ట్ర (Maharashtra) జట్టుకు మారిన పృథ్వీ షా.. కొత్త ప్రయాణంలో శుభారంభం అందుకున్నాడు. బుచ్చిబాబు రెడ్ బాల్ ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా... ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో ‘శత’క్కొట్టాడు. ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం మహారాష్ట్ర జట్టు 73 ఓవర్లలో 217 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ సౌరభ్ (50 నాటౌట్; 5 ఫోర్లు) అండతో పృథ్వీ షా జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చత్తీస్‌గఢ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.
నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు
ఇక సెంచరీ చేసిన అనంతరం పృథ్వీ షా తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. ‘‘నేను బాగున్నాను. నిజంగానే బాగున్నా. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మరేం పర్లేదు. ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది.
ఎవరూ లేకపోయినా.. నా కుటుంబం నాకు మద్దతుగా ఉంది. మానసికంగా నేను కుంగిపోయినపుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారు. అయితే, మరికొందరు మాత్రం తమ తమ పనులతో బిజీ అయిపోయారు. వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా!.. ఎవరి పని వాళ్లది.
నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ
నాకు సాయంగా రాలేదని వారిని నేను తప్పుబట్టను. ఏం చేసినా ఒంటరిగానే చేయాలి.. నన్ను నేను నిరూపించుకోవాలి అని గట్టిగా అనుకున్నాను. నిజానికి నాకు అదే మంచిది కూడా!జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఒకసారి ఉన్నత శిఖరాలు.. మరోసారి అధఃపాతాళం. అయినా నేను తిరిగి పుంజుకున్నాను. కాబట్టి అసాధ్యమనేది ఏదీ ఉండదని నమ్ముతాను.
నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. పనిపట్ల అంకిత భావం ఉంది. ఈ సీజన్‌లో నేను, నా జట్టు గొప్పగా రాణిస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అంటూ పృథ్వీ షా తన విమర్శకులకు కౌంటర్ ఇస్తూనే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.
చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్