
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. అతడు చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని.. ఓ ఆటగాడిగా ఏం చేయాలో అన్నీ చేసినా ఇలా పక్కకు పెట్టడం సరికాదని మండిపడ్డాడు.
మరోసారి మొండిచేయి
ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో పాల్గొనే భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు.
దేశవాళీ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్-2025లో పరుగుల వరద పారించినా సెలక్టర్లు ఈ ముంబై బ్యాటర్‌కు మొండిచేయి చూపారు. కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గానూ శ్రేయస్‌కు చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ తీరును విమర్శించాడు.
ఇంతకంటే ఇంకేం చేయగలడు?
‘‘ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం. ఆటగాడిగా అతడు ఇంతకంటే ఇంకేం చేయగలడు? ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఏడాది 600కు పైగా పరుగులు సాధించాడు.
కెప్టెన్‌గా తన జట్టు పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. టీమిండియా తరఫున చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఒక ఆటగాడిగానే కాదు.. మనిషిగా తనకు ఏమేం సాధ్యమవుతాయో.. అవన్నీ చేశాడు’’ అంటూ శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన ఆకాశ్ చోప్రా.. సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్ జట్టులో తప్పక ఉంటాడు
అదే విధంగా.. ‘‘ఇది ఆసియా కప్ జట్టు మాత్రమే. దీనిని వరల్డ్‌కప్ టీమ్‌గా భావించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ రెండు ఈవెంట్లకు మధ్య 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. మరి జట్టు మొత్తం తారుమారయ్యే అవకాశం ఉన్నట్లే కదా!
వన్డేల్లో నిలకడగా పరుగులు సాధిస్తూ ముందుకు సాగితే.. అతడు టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వగలడు. శ్రేయస్ అయ్యర్ ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో తప్పక ఉంటాడని నాకు గట్టి నమ్మకం’’ అంటూ ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.
చదవండి: ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్