
గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్-2025 ఆడే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. 2022-23 మధ్య కాలంలో శ్రేయస్ ఇంతకంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నాడు.
క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అదే సమయంలో ఫిట్‌నెస్ సమస్యలు కూడా అతడిని వెంటాడాయి. నాటి పరిస్థితి గురించి శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ విస్మయకర విషయాలు వెల్లడించాడు.
పక్షవాతం వచ్చింది
‘‘ఆ సమయంలో నేను నొప్పితో ఎంతగా విలవిల్లాడానో ఎవరికీ తెలియదు. నా కాలుకు పక్షవాతం వచ్చింది. వెన్నెముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్డుతో ఎలా మేనేజ్ చేసుకున్నానో నాకే తెలియదు. ఆ ప్లేస్‌లో ఉన్న నరం కూడా దెబ్బతిన్నది.
అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో భరించలేని నొప్పి. నా కాలి చిటికిన వేలు వరకు నొప్పి పాకింది. నిజంగా అదొక భయంకర అనుభవం’’ అని జీక్యూ ఇండియాకు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో పునరాగమనం చేయగా.. బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించింది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆడిన శ్రేయస్ అయ్యర్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
వాటిని మాత్రమే నియంత్రించగలను
అదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్య భూమిక అతడిదే. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ గొప్పగా రాణించాడు. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్ ఆడే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవడం గమనార్హం.
ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నేను నియంత్రించగలను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరచుకోవడం మాత్రమే నాకు తెలిసిన పని. అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో దానిని అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.
చదవండి: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్‌కు కూడా మంచి ఛాన్స్’