
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడి కంటే మొనగాడు మరొకరు లేరని.. ఆసియా కప్-2025 టోర్నమెంట్‌లో శ్రేయస్‌ను తప్పక ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య ఆసియా కప్ టీ20 టోర్నీ జరుగనుంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
టీమిండియాలో అతడి కంటే మొనగాడెవడు?
‘‘శ్రేయస్ అయ్యర్ గురించి కచ్చితంగా చర్చ జరగాలి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో మధ్య ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ కంటే గొప్పగా ఆడిన మొనగాడు లేడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాడు. కావాలనుకున్నపుడు బౌండరీలు బాదుతాడు.
అంతేకాదు.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌గా ఒత్తిడి పడకుండా తానే అంతా చూసుకుంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ శ్రేయస్ అదరగొట్టాడు. ఎన్నో అంచనాలు, ఒత్తిళ్ల నడుమ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఐపీఎల్ ఆడాడు.
వాళ్లంతా అలాగే వచ్చారు కదా!
భారత టీ20 జట్టును ఐపీఎల్ ప్రదర్శనల ద్వారానే ఎంపిక చేస్తున్నారు కదా! వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. ఇలా అందరూ అలా జట్టులోకి వచ్చిన వాళ్లే. కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆడేందుకు అర్హుడు అవుతాడు.
ఇక ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తిలక్ వర్మను తప్పించినట్లయితే.. శ్రేయస్ అయ్యర్ మూడు లేదంటే నాలుగో స్థానంలో సరిగ్గా ఫిట్ అవుతాడు. ఒకవేళ శ్రేయస్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే.. టీ20 క్రికెట్‌లో అది లోయర్ ఆర్డర్ లాంటిదే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో ధనాధన్.. ఫటాఫట్
కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదులుకుంది. ఈ క్రమంలో ఈ ముంబై బ్యాటర్ వేలంలోకి రాగా.. పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో రూ. 26.75 కోట్లకు అయ్యర్‌ను కొనుగోలు చేసి సారథిగా నియమించింది.
ఇక ఈ సీజన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రేయస్ అయ్యర్ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే, టైటిల్ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడటంతో శ్రేయస్, పంజాబ్‌కు భంగపాటు తప్పలేదు.
చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్