ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్.. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. కీలకమైన రెండో టెస్టు కోసం జైశ్వాల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.
జైశూ తన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బలహీనతను అధిగమించేందుకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆధ్వర్యంలో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశాడు. ఈ నేపథ్యంలో గౌహతి టెస్టుకు ముందు జైశ్వాల్‌ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. జైశ్వాల్ తన అహంకారాన్ని (Ego) పక్కన పెట్టి జాగ్రత్తగా ఆడాలని చోప్రా అభిప్రాయపడ్డాడు.
సాధారణంగా జైశ్వాల్ దూకుడుగా ఆడి జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని అందిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఆడే ప్రయత్నంలో తన వికెట్‌ను కూడా యశస్వి కోల్పోతుంటాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ కేవలం 12 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతడు సఫారీ స్పీడ్ స్టార్ మార్కో జాన్సెన్‌కే వికెట్ సమర్పించుకున్నాడు.
"యశస్వి జైశ్వాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అతడు చాలా సందర్భాల్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లకే ఔటయ్యాడు. అయితే గౌహతిలో రెండో టెస్టు జరగనుండడం జైశ్వాల్‌కు కలిసిస్తోంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్‌కు గౌహతిలోని బర్సపారా స్టేడియం హోం గ్రౌండ్‌గా ఉంది.
అక్కడ చాలా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి పిచ్ కండీషన్స్‌పై జైశ్వాల్ పూర్తి అవగాహన ఉంటుంది. ఈ మ్యాచ్‌లో కూడే జైశ్వాల్ దూకుడుగా ఆడే విధానాన్ని కొనసాగిస్తాడని అనుకుంటున్నాను. కానీ మార్కో జాన్సెన్‌ను మాత్రం కాస్త ఆచితూచి ఆడాలి. ఎందుకంటే అతడు చాలా డేంజరస్ బౌలర్.
కాబట్టి నీ ఈగోను పక్కన పెట్టి క్రీజులో నిలదొక్కకోవడానికి ప్రయత్నించాలి. జాన్సెన్ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే ఆ ప్రయత్నంలో మరోసారి ఔటయ్యే ప్రమాదం ఉందని" స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్ ప్లాన్'లో చోప్రా పేర్కొన్నాడు. కాగా రెండో టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యే అవకాశముంది. అతడి స్ధానంలో రిషబ్ పంత్ జట్టు పగ్గాలను చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చదవండి: IPL 2026: 'అతడొక అద్భుతం.. ఆర్సీబీ ప్లాన్ ఇదే'


