
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). ఈ ముంబై బ్యాటర్ నిలకడగా రాణిస్తూ.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఆసియా కప్-2025 (Asia Cup)లో పాల్గొనే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు.
పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌లో అతడికి స్థానం ఇవ్వలేకపోయామని.. అతడు ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కుండబద్దలు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని విమర్శిస్తున్నారు.
శ్రేయస్ అందరిలా కాదు
అయితే, అభిమానులు మాత్రం ఈ విషయంపై శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చాలా మంది క్రికెటర్లు ఇలాంటి సమయాల్లో సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా తమ ఆవేదనను పంచుకుంటూ.. అందుకు కారణమైన వారిని విమర్శిస్తారు. కానీ శ్రేయస్ మాత్రం ఇందుకు భిన్నం.
కూల్‌గా, కామ్‌గా ఉంటూ.. ఆటతోనే తానేంటో నిరూపించుకుని తన విలువను చాటుకుంటాడు. ఏదేమైనా.. పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోలోపల నిరాశ చెందడం సహజం. శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోశ్ అయ్యర్ ఈ మాటే అంటున్నాడు.
శ్రేయస్ ఇంకేం చేయాలి?
ఆసియా కప్-2025 జట్టులో తన కుమారుడికి చోటు దక్కకపోవడంపై సంతోశ్ అయ్యర్ తాజాగా స్పందించాడు. టీమిండియాకు ఎంపిక కాకపోవడం వల్ల శ్రేయస్ స్పందన ఎలా ఉందో వివరించాడు. ఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే శ్రేయస్ ఇంకేం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు.
ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు. ఈసారి పంజాబ్ కింగ్స్‌ను కూడా ఫైనల్‌కు చేర్చాడు. కెప్టెన్‌గా గొప్ప విజయాలు సాధించాడు. బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు.
నా కుమారుడిని టీమిండియా సారథిని చేయమని నేను అడగడం లేదు. కనీసం జట్టులో చోటైనా ఇవ్వాలి కదా!.. భారత జట్టులో చోటు కోల్పోయినపుడు కూడా తన ముఖంలో ఎవరి పట్ల ఎలాంటి తిరస్కార భావం కనిపించదు.
టీమిండియా స్టార్ రియాక్షన్ ఇదే
‘ఇదంతా నా రాత! దీనికి నువ్వేం చేయగలవు? ఇపుడు మనమేమీ చేయలేము’ అంటాడు. ఎప్పటిలాగే ఇప్పుడూ అలాగే అన్నాడు. కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. ఎవరినీ నిందించడు. కానీ లోలోపల.. జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధ వాడిని వెంటాడుతూనే ఉంటుంది’’ అని సంతోశ్ అయ్యర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో పేర్కొన్నాడు.
కాగా శ్రేయస్ అయ్యర్ చివరగా టీమిండియా తరఫున ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడాడు. ఈ వన్డే టోర్నీలో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. 243 పరుగులతో రాణించి భారత్ తరఫున టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్‌కు ఆడిన శ్రేయస్ అయ్యర్.. 604 పరుగులతో సత్తా చాటాడు.
చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’