
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయి చూపడం గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.
అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లను కేవలం స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. పేసర్ల విభాగంలో హర్షిత్ రాణాకు చోటు దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లను సెలక్టర్లు పక్కకు పెట్టడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు. గంభీర్ ఆశీసులు ఉండటం వల్లే హర్షిత్‌కు స్థానం దక్కిందని పరోక్షంగా కామెంట్లు చేశాడు.
అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు
ఈ మేరకు.. ‘‘హర్షిత్ రాణా అంటే ఎవరికీ బాగా ఇష్టమో అందరికీ తెలుసు. అందుకే అతడికి వరుస అవకాశాలు వస్తునఆయి. ఐపీఎల్‌లో చెత్తగా ఆడినా అతడికి చోటిచ్చారు. ప్రసిద్ కృష్ణ ఐపీఎల్‌లో, ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టినా ప్రధాన జట్టులో అతడికి స్థానమే లేదు.రాణా ఈ జట్టులోకి ఎలా వచ్చాడో నేను అర్థం చేసుకోగలను. కచ్చితంగా ఇదొక చెత్త సెలక్షన్.

సిరాజ్, ప్రసిద్‌లు ఏం తప్పు చేశారు?
మహ్మద్ సిరాజ్ వంటి గొప్ప బౌలర్‌ను కూడా పక్కనపెట్టాడు. ఒకవేళ వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారని అనుకుంటే.. ప్రసిద్ కృష్ణ ఉన్నాడు కదా! అయినా సరే హర్షిత్ రాణాకే పెద్దపీట వేశారు’’ అని బద్రీనాథ్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైకి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.
గంభీర్ ప్రోత్సాహం
కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో ఆ జట్టులో ఉన్న హర్షిత్ రాణాను గంభీర్ ప్రోత్సహించాడు. గంభీర్ మార్గనిర్దేశనంలో రాణించిన ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ అయిన తర్వాత ఏకంగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు, వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు.
అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో హర్షిత్ కేవలం పదిహేను వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన కర్ణాటక పేసర్ ప్రసిద్... 25 వికెట్లతో చెలరేగి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.