
శ్రేయస్ అయ్యర్- సందీప్ శర్మ (PC: BCCI)
రాజస్తాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రాణించినంత ఉన్నంత మాత్రాన.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను టీమిండియా సారథిని చేయాల్సిన అవసరం లేదన్నాడు. సెన్స్‌లేని వాళ్లే అతడిని కెప్టెన్‌ను చేయాలని మాట్లాడతారని పేర్కొన్నాడు.
పరుగుల వరద.. అయినా కనికరించని సెలక్టర్లు
కాగా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను విజేతగా నిలిపిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వచ్చి.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
అంతేకాదు బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ ఆసియా కప్-2025 టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను పిలిపించిన బీసీసీఐ.. అతడికి మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.
శ్రేయస్‌ను కెప్టెన్ చేయాలి
ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ అన్యాయం చేస్తోందనే విమర్శలు వచ్చాయి. ఓ ఆటగాడిగా తాను చేయాల్సిందింతా చేసినా అయ్యర్‌ను పక్కనపెట్టడం సరికాదని మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరికొంత మంది టీమిండియా టీ20 భవిష్య కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ సరైనోడని అభిప్రాయపడ్డారు.
సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?
ఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ తాజాగా స్పందించాడు. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐకి సొంత డొమెస్టిక్ లీగ్ ఉంది కదా!.. ఎంతో మంది అక్కడ ఆడుతూ ఉంటారు. అయితే, అంతర్జాతీయ స్థాయి జట్టును ఎంపిక చేసినపుడు కేవలం 15 మంది పేర్లనే పరిగణనలోకి తీసుకుంటారు.
ఆ పదిహేను మందిని మేనేజ్ చేయగల ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారు. ఇక ఇక్కడ.. అంటే ఐపీఎల్‌లో చాలా మంది దేశీ క్రికెటర్లతో పాటు.. యువకులు, విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఇక్కడ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం వేరు.
టీమిండియాను మేనేజ్ చేయగల వ్యక్తి మాత్రమే మంచి కెప్టెన్ అవుతాడు. మరి ఈ చర్చ ఎందుకు? ఇలాంటివి సెన్స్‌లెస్ అని అనిపిస్తుంది. ఓ ఆటగాడు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రాణిస్తే.. టీమిండియా కెప్టెన్ అయిపోలేడు’’ అని సందీప్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రెండే మ్యాచ్‌లు.. ఒక వికెట్
కాగా చాలా మంది ఆటగాళ్లలాగే.. పంజాబ్‌కు చెందిన సందీప్ శర్మ కూడా ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీశాడు.
కానీ ఐపీఎల్‌లో ఆడితే టీమిండియాలోకి రావడం అంతతేలిక కాదంటూ సందీప్ వ్యాఖ్యానించడం విశేషం. లీగ్ క్రికెట్ జట్టుకు, అంతర్జాతీయ జట్టుకు తేడా ఉంటుందని.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేయాలనడం సరికాదంటూ అభిప్రాయపడటం గమనార్హం.
చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా..