
ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ రూపంలో తొలి వికెట్ అందుకుని.. సౌతాఫ్రికా తరఫున 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
కైర్న్స్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేశవ్ మహరాజ్ ఐదు వికెట్లతో చెలరేగి.. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. లబుషేన్ (1)తో పాటు.. కామెరాన్ గ్రీన్ (3), జోష్ ఇంగ్లిస్ (5), అలెక్స్ క్యారీ (0) రూపంలో నలుగురు కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు.
సరికొత్త చరిత్ర
ఇక ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన కేశవ్ మహరాజ్ (5/33) తన వన్డే కెరీర్‌లో ఈ మేర తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ ఘనత సాధించిన సౌతాఫ్రికా తొలి స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు.
దిగ్గజాల సరసన
కాగా అంతకుముందు పేసర్లు మఖయా ఎంతిని (6), లుంగి ఎంగిడి (6).. లాన్స్ క్లుసేనర్, షాన్ పొలాక్, మార్కో యాన్సెన్, మోర్నీ మోర్కెల్, నిక్కీ బోజే, రిచర్డ్ స్నెల్ తదితరులు ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఫీట్ నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు వన్డే సిరీస్‌లో గెలుపు బోణీ కొట్టిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 98 పరుగుల తేడాతో గెలిచి 1–0తో ముందంజ వేసింది. కేశవ్ మహరాజ్ దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.
ప్రతీకారం తీర్చుకున్న సౌతాఫ్రికా
కాగా.. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ అనంతరం కంగారూ, సఫారీ జట్ల మధ్య ఇదే తొలి వన్డే కాగా... ఆ మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా జట్టు... ఇప్పుడు విజయంతో బదులు తీర్చుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.
మార్క్‌రమ్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ తెంబా బవుమా (74 బంతుల్లో 65; 5 ఫోర్లు), మాథ్యూ బ్రీజ్కె (56 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. రికెల్టన్ (33; 3 ఫోర్లు), ముల్డర్ (26 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో ట్రావిస్ హెడ్ 9 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
కుదేలైన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్
అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. 40.5 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (96 బంతుల్లో 88; 10 ఫోర్లు) మినహా టాపార్డర్ విఫలమైంది. లబుషేన్ (1), కామెరూన్ గ్రీన్ (3), జోష్ ఇన్‌గ్లిస్ (5), అలెక్స్ కేరీ (0), ఆరోన్ హార్డీ (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తొలి వికెట్‌కు హెడ్ (24 బంతుల్లో 27; 6 ఫోర్లు)తో కలిసి 60 పరుగులు జోడించిన మార్ష్... ఏడో వికెట్‌కు డ్వార్‌షుయ్ (52 బంతుల్లో 33; 3 ఫోర్లు)తో కలిసి 71 పరుగులు జోడించాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేశవ్ మహరాజ్ (5/33) మాయాజాలానికి ఆసీస్ టాపార్డర్ పెవిలియన్‌కు వరుస కట్టింది. వన్డేల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కేశవ్ వరుసగా... లబుషేన్, గ్రీన్, ఇన్‌గ్లిస్, కేరీ, హార్డీ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక దశలో 60/0తో పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్ జట్టు... 29 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి 89/6తో నిలిచింది. మార్ష్ పోరాడినా ఫలితం లేకపోయింది.
చదవండి: ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్