
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ (Jamie Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో మూడో టెస్టు సందర్భంగా లార్డ్స్ (Lord's Test)లో జేమీ స్మిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
సర్రేకు చెందిన జేమీ స్మిత్.. గతేడాది వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియాతో సిరీస్‌లో మాత్రం 24 ఏళ్ల జేమీ స్మిత్ దుమ్ములేపుతున్నాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో 40, 44* పరుగులు చేసిన జేమీ స్మిత్.. రెండో టెస్టులో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
భారీ అజేయ శతకం
తొలి ఇన్నింగ్స్‌లో భారీ అజేయ శతకం (184)తో మెరిసి ఇంగ్లండ్ ఓటమి వాయిదా పడేలా చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత అర్ధ శతకం (88) బాదినా.. పరాజయం నుంచి జట్టును తప్పించలేకపోయాడు.
ఇక తాజాగా లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కుకు చేరుకున్నాడు జేమీ స్మిత్. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ జారవిడిచాడు. ఫలితంగా లైఫ్ పొందిన జేమీ స్మిత్.. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వరల్డ్ రికార్డు
కాగా తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జేమీ స్మిత్ ఈ సందర్భంగా సమం చేశాడు. అదే విధంగా.. అతి తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు.
తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు
🏏క్వింటన్ డి కాక్, జేమీ స్మిత్- 21 ఇన్నింగ్స్‌లో
🏏దినేశ్ చండిమాల్, జానీ బెయిర్‌స్టో- 22 ఇన్నింగ్స్‌లో
🏏కుమార్ సంగక్కర, ఏబీ డివిలియర్స్- 23 ఇన్నింగ్స్‌లో
🏏జెఫ్ డుజోన్- 24 ఇన్నింగ్స్‌లో
తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు
🏏జేమీ స్మిత్ (ఇంగ్లండ్)- 1303 బంతుల్లోనే
🏏సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్)- 1311 బంతుల్లో
🏏ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 1330 బంతుల్లో
🏏నిరోషన్ డిక్‌విల్లా (శ్రీలంక)- 1367 బంతుల్లో
🏏క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా)- 1375 బంతుల్లో.
👉ఇదిలా ఉంటే.. టీమిండియా మూడో టెస్టులో భాగంగా శుక్రవారం నాటి రెండో ఆటలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 105 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది.
చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్?